కోహ్లీ కెప్టెన్సీ ఇన్నింగ్స్..ఇండియా గెలుపు - MicTv.in - Telugu News
mictv telugu

కోహ్లీ కెప్టెన్సీ ఇన్నింగ్స్..ఇండియా గెలుపు

August 12, 2019

Kohli captaincy innings..India win..

వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు ఫార్మాట్ల సిరీస్‌లో టీ-20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. ఇక వన్డే సిరీస్‌పై కన్నేసింది. ఈ క్రమంలో తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కావడంతో.. రెండో వన్డేలో ఘనవిజయంతో శుభారంభం చేసింది. విరాట్ కోహ్లీ బ్యాట్‌తో విజృంభిస్తే.. భువనేశ్వర్ బౌలింగ్‌తో ఆకట్టుకుని భారత జట్టు విజయ తీరాలకు చేర్చారు. టీమిండియా బౌలర్ల దాటికి వెస్టిండీస్ బ్యాట్స్‌మన్స్ నిలవలేకపోయారు. రెండో వన్డేకు కూడా వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌ వర్త్ లుయీస్ పద్ధతిలో టీమిండియా.. వెస్టిండీస్‌పై 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.

క్వీన్స్‌పార్క్‌ ఓవల్‌ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 120 పరుగులతో కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక శ్రేయస్ అయ్యర్ 71 పరుగులతో జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. 280 పరుగుల లక్ష్యం ఛేదించడానికి రంగంలోకి దిగిన వెస్టిండీస్ టార్గెట్ చేధించేదుకు గట్టిగానే ప్రయత్నించినా వర్షం అంతరాయం కల్పించింది. మ్యాచ్ వాయిదా పడటంతో లక్ష్యాన్ని 46 ఓవర్లలో 270 పరుగులకు తగ్గించారు. ఈ దశలో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయి వెస్టిండీస్ జట్టును కట్టడి చేశారు.. 42 ఓవర్లలో 210 పరుగులకే ఆలౌట్ అయ్యింది విండీస్ జట్టు. దీంతో 59 పరుగుల తేడాతో విజయం సాధించింది భారత జట్టు.