2023 నాటికి జనాభాలో చైనాను దాటి భారత్ మొదటి స్థానంలో ఉంటుందని ఐరాస నివేదిక వెల్లడించింది. జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పునస్కరించుకుని జనాభా అంచనాల నివేదికను ఐరాస విడుదల చేసింది. అందులో ఈ ఏడాది నవంబరు నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. గణాంకాల ప్రకారం ప్రస్తుత చైనా జనాభా 142.6 కోట్లు కాగా, భారత్ జనాభా 141.2 కోట్లుగా నమోదైంది. అలాగే 2050 నాటికి భారత జనాభా 166.8 కోట్లకి పెరిగి, చైనా జనాభా 131.7 కోట్లకు పడిపోతుందని పేర్కొంది. ఇక అత్యధిక జనాభా పెరుగుదల ఉన్న దేశాలలో భారత్, పాకిస్తాన్, నైజీరియా, కాంగో, ఈజిప్టు, ఇథియోపియా, ఫిలిప్పీన్స్, టాంజానియాలు నిలుస్తాయని అంచనా. అలాగే జనాభా వృద్ధి రేటు ఆధారంగా ఆయా దేశాల ఆర్ధిక వ్యవస్థలు ఉండబోతున్నాయి. ‘జీవన ప్రమాణాలు పెరగడం, మహిళా శిశు మరణాలు తగ్గడం వంటి కారణాలతో జనాభా పెరుగుతోంది. అదే సమయంలో దీని వల్ల కలిగే దుష్ప్రభావాల నుంచి భూమిని రక్షించుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాల’ని నివేదిక స్పష్టం చేసింది.