కరోనా టూరిస్ట్ వీసాపై రాలేదు.. అవే జీవితాలకు రోగనిరోధక శక్తి .. - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా టూరిస్ట్ వీసాపై రాలేదు.. అవే జీవితాలకు రోగనిరోధక శక్తి ..

May 11, 2020

India will be risking economic hara-kiri, if lockdown extended for much longer: Anand Mahindra

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మంచి మంచి వీడియోలను షేర్ చేసే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర కరోనా మహమ్మరిపై సోషల్ మీడియాలో తన మనోభావాలను పంచుకున్నారు. మనం వైరస్‌తో కలిసి జీవించాల్సిందే.. అదేమీ  పర్యాటక వీసాపై ఇక్కడికి రాలేదని ట్వీట్ చేశారు. లాక్‌డౌన్ పొడిగిస్తే పేదలకు ఆర్థిక కష్టాలు పెరుగుతాయని ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా అంతానికి మన శరీరంలో రోగనిరోధక శక్తి అత్యంత అవసరం అని వైద్యులు అంటున్న విషయం తెలిసిందే. ఆనంద్ మహీంద్రా మాత్రం ఆర్థిక వ్యవస్థలే జీవితాలకు రోగ నిరోధక శక్తి అంటున్నారు. 

లాక్‌డౌన్‌ను మరింత కాలం పొడగిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు అది ఆత్మహత్యకు పూనుకునేలా చేస్తుందని పేర్కొన్నారు. ‘లక్షల మంది ప్రాణాలు కాపాడుకొనేందుకు లాక్‌డౌన్‌ అమలు చేసినప్పటికీ ఇంకా పొడిగిస్తే సమాజంలోని పేదలు తీవ్ర ఇబ్బందులు పడతారు. కొన్ని రోజులుగా కరోనా వైరస్‌ కర్వ్‌ సమాంతరంగా ఉన్నప్పటికీ మళ్లీ కొత్త కేసులు పెరిగాయి. ఎక్కువ పరీక్షలు చేయడంతో ఎక్కువ కేసులు కనిపిస్తున్నా దేశ జనాభా, ప్రపంచంతో పోల్చుకుంటే తక్కువే. వైరస్‌ కర్వ్‌ వెంటనే సమాంతరం అవుతందని మనం ఆశించొద్దు. అయితే లాక్‌డౌన్‌ సహాయపడలేదని అనుకోవద్దు. సమష్టి కృషితో లక్షల మరణాలు సంభవించకుండా అడ్డుకున్నారు. పదిలక్షల మందికి ప్రస్తుతం భారత్‌లో చనిపోతున్నది కేవలం 1.4 మందే. అదే ప్రపంచవ్యాప్తంగా సగటున 35, అమెరికా సగటున 228గా ఉంది. పనిచేస్తున్న, ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ జీవితాలకు రోగనిరోధక శక్తి వంటిది. లాక్‌డౌన్‌ దానిని బలహీనపరిచి పేదలపై మరింత దుష్ప్రభావం చూపిస్తుంది’ అని మహీంద్రా ట్విటర్‌లో పేర్కొన్నారు. 

మరోవైపు దేశంలో కరోనా మరణాలను తగ్గించేందుకు ఆక్సీజన్‌ వసతులతో కూడిన తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని మహీంద్ర తెలిపారు. మరింత విస్తృతంగా పరీక్షలు చేయాలని సూచించారు. వైరస్‌ వాహకులను వెతికి పట్టుకోవాలని.. జోన్లలో కంటెయిన్‌మెంట్‌పై కాకుండా సబ్‌ పిన్‌కోడ్‌ స్థాయిల్లో కంటెయిన్‌మెంట్‌పై దృష్టి పెట్టాలని చెప్పారు.