రాజ్‌కోట్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో టెస్టు క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డు సృష్టించింది. 272 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన భారత్‌కు.. టెస్టుల్లో ఇదే అతిపెద్ద గెలుపు. శనివారం మూడో రోజు ఆటలో భాగంగా ఫాలోఆన్ ఆడిన వెస్టిండీస్ తన రెండో ఇన్నింగ్స్‌లో 50.5 ఓవర్లలో 196 పరుగులకు చేతులెత్తేసింది. దీంతో భారత్ తన టెస్టు క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని సాధించింది. ఇటీవల జరిగిన అఫ్గానిస్తాన్‌తో టెస్టు మ్యాచ్‌లో లభించిన ఇన్నింగ్స్‌లో 262 పరుగుల రికార్డు టీమిండియా తిరగరాసింది.
విండీస్ ఆటగాళ్లలో ఒక్క కీరన్ పావెల్(83) తప్పా.. మిగతా ఎవరూ రాణించలేదు. దీంతో ఆ జట్టు ఘోర ఓటమి చవిచూసింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో విండీస్‌ను పిండిచేయగా, జడేజా 3 వికెట్లు తీశాడు. రవిచంద్రన్ అశ్విన్‌కు 2 వికెట్లు సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన విండీస్ 94/6 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన విండీస్ 181 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఫాలోఆన్ ఆడాల్సి వచ్చింది. రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన విండీస్ మళ్లీ అదే ఆటతీరును ప్రదర్శించింది. ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్(10) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరగా, ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు వికెట్లను కోల్పోయారు. విండీస్ తొలి వికెట్‌ను అశ్విన్ తీయగా, ఆపై ఐదు వికెట్లను కుల్దీప్ యాదవ్ సాధించాడు. విండీస్ చివరి నాలుగు వికెట్లలో రవీంద్ర జడేజా మూడు, అశ్విన్ ఓ వికెట్ తీశాడు. దీంతో విండీస్ 200 పరుగుల మార్కును కూడా చేరకుండానే అలౌటైంది.