India won by 65 runs against New Zealand
mictv telugu

కివీస్ పై భారత్ ఘన విజయం

November 20, 2022

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ బోణి కొట్టింది. రెండవ టీ20లో 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ మెరుపు సెంచరీకి తోడు బౌలర్లు రాణించడంతో భారత్ సిరీస్‌లో ముందంజ వేసింది. భారత్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేక 126 పరుగులకే ఆతిథ్య జట్టు ఆలౌట్ అయ్యింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన భారత్ 20 ఓవర్లలో 191 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ మినహా మిగిలిన ఆటగాళ్లంతా నిరాశపరిచారు. అయితే భారత్ జట్టు ఓపెనర్‌గా దిగిన ఇషాన్ కిషాన్(36) ఒకింత పర్వాలేదన్నట్లుగా మెప్పించాడు. ఓపెనర్‌గా వచ్చిన పంత్ ఆరు పరుగులకే వెనుదిరిగాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో మరోసారి రెచ్చిపోయాడు. మొత్తం 51 బంతుల్లో 111 పరుగులు చేశాడు.

కేవలం 49 బంతులలోనే సెంచరీని బాది, తన కెరీర్ లో రెండో శతకాన్ని నమోదు చేసుకున్నాడు. 32 బంతుల్లో మొదటి 50 పరుగులు చేసిన స్కై.. తర్వాత 17 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. సూర్యకుమార్ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 7 సిక్సర్లు ఉండడం విశేషం. స్కోరు 200 దాటేలా కనిపించినా.. చివరి ఓవర్‌లో సూర్యకుమార్‌కు స్ట్రైకింగ్ రాకపోవడం,వరుస మూడు వికెట్లు కోల్పోవడం భారత్ మరికొన్ని పరుగులు చేయలేకపోయింది. లాస్ట్ ఓవర్‌లో సౌథి హ్యాట్రిక్ సాధించాడు. వరుస బంతుల్లో హార్దిక్ పాండ్య, దీపక్ హుడా,వాషింగ్టన్ సుందర్‌లను వరుస బంతుల్లో పెవిలియన్‌కు పంపాడు.. ఈ ఓవర్‌లో కేవలం ఐదుపరుగులే వచ్చాయి. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ 3 వికెట్లు, ఫెర్గ్యూసన్ రెండు, సోథి ఒక వికెట్ దక్కించుకున్నారు

192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ కు మొదటిలోనే షాక్ తగిలింది.ఇన్నింగ్స్ రెండో బంతికే అలెన్‌ను భువనేశ్వర్ కుమార్ పెవిలియన్‎కు పంపాడు. తర్వాత వచ్చిన విలియమ్స్‎న్, కాన్వే కాసేపు క్రీజులు నిలిచారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 56 పరుగులు జోడించారు. 25 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కాన్వే ఔట్ కావడం..తర్వాత వచ్చిన బ్యాటర్లు వరుస పెవిలియన్‌కు క్యూకట్టడంతో న్యూజిలాండ్ ఓటమి ముందుగానే ఖాయమైపోయింది. కెప్టెన్ విలియమ్స్‌న్ 61 పరుగులతో ఒంటరి పోరాటం చేసిన ఫలితం లేకుండా పోయింది. భారత బౌలర్లలో దీపక్ హుడా 4 వికెట్లు తీయగా.. సిరాజ్, చాహల్ చెరో రెండు వికెట్లు తీశారు. భువీ, సుందర్ తలో వికెట్ పడగొట్టారు. తన బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించిన సూర్యకుమార్ యాదవ్‌కు ’మ్యాన్ ఆఫ్ మ్యాచ్‘ అవార్డు దక్కింది.