ఒడిషా రాష్ట్రంలో జరుగుతున్న హాకీ ప్రపంచ కప్ తొలి మ్యాచులో భారత్ బోణీ చేసింది. రూర్కెలాలో జరిగిన టోర్నీ ప్రారంభ మ్యాచులో యూరప్ అగ్రశ్రేణి జట్టయిన స్పెయిన్ పై 2-0 తేడాతో గెలిచింది. ప్రథమార్ధం ముగిసేసరికి భారత్ రెండు గోల్స్ చేసి ఆధిక్యంలో నిలవగా, ద్వితీయార్ధంలో గోల్స్ చేయకున్నా స్పెయిన్ ఎటాక్ లను సమర్ధంగా ఎదుర్కొంది. స్పెయిన్ ఎంత ప్రయత్నించినా భారత గోల్ కీపర్ పాఠక్ అడ్డుగోడలా నిలిచాడు. చివర్లో భారత ప్లేయర్ అభిషేక్ గ్రౌండును వీడినా.. పది మందితో ఆడిన భారత్ ఒక్క అవకాశం కూడా ప్రత్యర్ధికి ఇవ్వలేదు. భారత్ తరపున అమిత్ రోహిదాస్, హార్దిక్ సింగ్ లు చెరొక గోల్ చేశారు. భారత్ తన తదుపరి మ్యాచ్ ఆదివారం ఇంగ్లాండుతో ఆడనుంది. కాగా, ఈ ప్రపంచ కప్ గెలిస్తే జట్టులోని ఒక్కో సభ్యుడికి కోటి రూపాయల నజరానా ఇస్తానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇదివరకే ప్రకటించారు. సొంతగడ్డపై జరుగుతున్న టోర్నీ కావడంతో భారత జట్టుపై అంచనాలు నెలకొన్నాయి.