గుహవాటిలో శ్రీలంకతో జరుగుతున్న మొదటి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది. రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ అర్ధ సెంచరీలతో రాణించగా, విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ సాధించి పలు రికార్డులను కొల్లగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన లంక భారత బౌలర్ల ధాటికి చతికిలపడింది. ముఖ్యంగా ఉమ్రాన్ మాలిక్, సిరాజ్ బౌలింగును ఎదుర్కోలేక వరుసగా వికెట్లను కోల్పోయింది. నిస్సాంక (72), ధనుంజయ డిసిల్వా (47) పరుగులు చేసినా మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. చివర్లో దాసున్ శనక (88 బంతుల్లో 108) సెంచరీతో వీరోచితంగా పోరాడినా అప్పటికే ఓవర్లు ముగియడంతో పరాజయం తప్పలేదు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3, సిరాజ్ 2, షమి, హార్దిక్, చాహల్ చెరో వికెట్ తీశారు. అక్షర్ పటేల్‌కి ఒక్క వికెట్ కూడా దక్కలేదు. చివరికి లంక జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. భారత్ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది.