భారత్ ఎఫెక్ట్.. అమెరికాలోనూ టిక్‌టాక్ నిషేధానికి డిమాండ్ - MicTv.in - Telugu News
mictv telugu

భారత్ ఎఫెక్ట్.. అమెరికాలోనూ టిక్‌టాక్ నిషేధానికి డిమాండ్

July 2, 2020

India,Americans Demand Ban Tiktok

టిక్‌టాక్ సహా 59 చైనా యాప్స్‌పై భారత్ ప్రభుత్వం ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది. డ్రాగన్ దేశ దుందుడుకు చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్థిక మూలాలపై పడింది. ఈ చర్యకు భారత్‌లోనే కాదు.. పొరుగు దేశాల్లోనూ సానుకూల స్పందన ఏర్పడింది. చాలా కాలంగా టిక్‌టాక్ వైపరిత్యంపై ఎంతో మంది అసంతృప్తిగానే ఉన్నారు. ఈ క్రమంలో భారత్ టిక్‌టాక్‌పై వేటు వేయడంతో అమెరికాలోనూ నిషేధంపై డిమాండ్ వ్యక్తం అవుతోంది. తమ దేశంలో కూడా దాన్ని పూర్తిగా నిషేధించాలని ప్రజలు కోరుతున్నారు. రిపబ్లికన్‌ సెనెటర్‌ జాన్‌ కోర్నిన్‌ సహా పలువురు ప్రముఖులు భారత్‌కు మద్దతుగా ట్వీట్‌ చేశారు. 

ప్రస్తుతం అమెరికాలో 4 కోట్లకు పైగా ప్రజలు టిక్ టాక్ వాడుతున్నారు. దీని  కారణంగా చైనా ఆర్థికంగా లాభం పొందుతోంది. దీన్ని వాడుకొని చైనా తమ సొంత ప్రయోజనాలకు దుర్వినియోగం చేస్తోందని చాలా మంది ఆరోపిస్తున్నారు. మోదీ సర్కార్ కూడా వీటిని భూచిగా చూపి వేటు వేయడంతో అమెరికాలో కూడా నిషేధించాలని కోరుతున్నారు. ఇప్పటికే అక్కడి ప్రభుత్వ ఉద్యోగులు టిక్‌టాక్‌ వాడటాన్ని నిషేధించాలంటూ రూపొందించిన రెండు బిల్లులు కాంగ్రెస్‌లో పెండింగ్‌లోనే ఉంది. దీంతో అక్కడి మీడియా, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, ప్రజలు అంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. మరి దీనిపై యూఎస్ సర్కార్ ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది. కాగా కరోనా వ్యాప్తి జరిగినప్పటి నుంచి ట్రంప్ ఇప్పటికే చైనాపై పీకలలోతు కోపంలో ఉన్న సంగతి తెలిసిందే.