కూలిన బ్రిడ్జి గంటల వ్యవధిలో నిర్మాణం .. వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

కూలిన బ్రిడ్జి గంటల వ్యవధిలో నిర్మాణం .. వీడియో వైరల్

July 3, 2022

అమర్‌నాథ్ యాత్రా మార్గంలో కూలిన బ్రిడ్జిని గంటల వ్యవధిలోనే పునరుద్ధరించి ఔరా అనిపించింది ఇండియన్ ఆర్మీ. ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ ఈ ఘనత సాధించింది. హిమాలయ పర్వత శ్రేణుల్లో, 3880 మీటర్ల ఎత్తులో కొనసాగే అమర్‌నాథ్ యాత్ర జూన్ 30న తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెండేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో ప్రారంభమైన ఈ యాత్రకు ఈసారి భక్తులు పోటెత్తారు.

మంచు శివలింగాన్ని దర్శించడానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇండియన్ ఆర్మీ జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే ఇటీవలే ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కారణంగా జూన్ 30, జులై 1 మధ్య రాత్రి కొండచరియలు విరిగిపడి యాత్రా మార్గంలో బల్తాల్ వద్ద వంతెనలు కొట్టుకుపోయాయి. కాళీమాతా ఆలయ సమీపంలోని ప్రవాహం వద్ద ఈ ఘటన జరిగింది. బ్రిడ్జి కొట్టుకుపోయిన విషయాన్ని గమనించిన ఆర్మీ జవాన్లు.. వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన కర్రలను తరలించారు. ఇంజినీర్ రెజిమెంట్‌కు చెందిన సభ్యులను, సాంకేతిక నిపుణులను అక్కడికి రప్పించారు. వెంటనే వంతెన నిర్మాణ పనులు ప్రారంభించి కేవలం నాలుగు గంటల్లోనే అక్కడ కొత్త బ్రిడ్జిని నిర్మించారు. అమర్‌నాథ్ యాత్ర నిరాటంకంగా కొనసాగేలా చేశారు. సరిహద్దులో పహారా కాయడమే కాదు, ఆపద సమయాల్లో సాహసోపేతమైన చర్యలతో ఇండియన్ ఆర్మీ.. అందరి మనసులను గెలుచుకుంటోంది.