బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్…ఈ పేరు వినగానే నాలుగేళ్ల క్రితం భారతసైన్యం చేసిన శౌర్య చరిత్ర గుర్తుకువస్తుంది. సరిగ్గా ఈరోజు అంటే ఫిబ్రవరి 26,2019న పాకిస్తాన్‌లోని పఖ్తున్ఖ్వాలోని బాలాకోట్ లో భారతవైమానిక దళం అర్థరాత్రి ఫైటర్ జెట్ లతో ఉగ్రవాదుల స్థావరాలపై విరుచుకుపడింది. ఉగ్రమూకల స్థావరాలను ధ్వంసం చేసింది. బాలాకోట్ వైమానిక దాడి చేయాలన్న నిర్ణయం ఒక్కరోజు తీసుకున్నది కాదు. పుల్వామా దాడి ఘటన జరిగిన రోజే..బాలాకోట్ వైమానిక దాడి స్క్రీప్ట్ రెడీ అయ్యింది. బాలాకోట్ పై భారత సైన్యం తీర్చుకున్న ప్రతీకారం గురించి తెలుసుకుందాం.
2019, ఫిబ్రవరి 14..జమ్మూకశ్మీర్ లోని పుల్వామా దాడి యావత్ భారతాన్నే కాదు ప్రపంచాన్ని సైతం తీవ్రదిగ్భ్రాంతికి గురి చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్ఏ మహ్మద్ ఉగ్రవాద సంస్థ భారతీ ఆర్మీ కాన్వాయ్ విచక్షణ రహితంగా కాల్పులకు పాల్పడింది. సరిగ్గా మధ్యాహ్నం 3గంటల సమయంలో శ్రీనగర్ హైవేపై సీఆర్పీఎఫ్ జవాన్లతో కూడిన బస్సులు వెళ్తున్నాయి. కాన్వాయ్ ముందు చొచ్చుకొచ్చిన ఉగ్రమూకలు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది సైనికులు వీరమరణం పొందారు.
ఉగ్రమూకల దాడితో పాకిస్తాన్ పై ప్రతీకార మంటలు దేశమంత వ్యాపించాయి. యావత్ భారతదేశం పగతో రగిలిపోయింది. దేశం నలుమూలల నుంచి ప్రతీకారం తీర్చుకోవాలంటూ డిమాండ్లు పెరిగాయి. జమ్మూ నుంచి కన్యకుమారి వరకు దేశ్ మాంగే బద్లా నినాదాలు మిన్నంటాయి.
“అమరవీరుల బలిదానం వృధా అవ్వదు. దోషులు ఖచ్చితంగా శిక్షించబడతారు”. పుల్వామా ఉగ్రదాడి జరిగిన ఒక రోజు తర్వాత మహారాష్ట్రలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు. ర్యాలీలో ప్రసంగిస్తూ, ఈసారి ప్రతికారం ఏ స్థాయిలో ఉంటుందో చూడాలంటూ ప్రధాని మోదీ దేశప్రజలకు సూచించారు. దేశప్రజల గుండెల్లో ఉన్న కోపమే నా ప్రకటనకు కారణం అన్నారు. ఉగ్రవాదుల నేరానికి పూర్తి ప్రతీకారం తీర్చుకుంటామని, ఇందుకోసం సైన్యానికి స్థలం, సమయాన్ని నిర్ణయించుకునే స్వేచ్ఛ ఇచ్చామని మోదీ చెప్పారు.
పుల్వామా దాడి జరిగిన 3 గంటల తర్వాత ప్రతీకారానికి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ రెడీ అయ్యింది. 12 రోజుల తరువాత, 26 ఫిబ్రవరి 2019 తెల్లవారుజామున, మిరాజ్ 2000 యుద్ధ విమానాలు వైమానిక దళం గ్వాలియర్ ఎయిర్‌బేస్ నుండి ఇజ్రాయెల్ బాంబులతో బయలుదేరాయి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో, 12 మిరాజ్ విమానాలు పాకిస్తాన్ రాడార్ వ్యవస్థను తప్పించుకుంటూ ప్రవేశించి జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డాయి. ఈ కాల్పుల్లో 200 మంది ఉగ్రవాదుల మరణించారు. ఈ ఆపరేషన్‌కు ‘ఆపరేషన్ బందర్’ అని పేరు పెట్టారు. ఉగ్రవాదులకు ఏం జరుగుతుందో అని అర్థమయ్యే లోపే మన భారత సైన్యం పని ముగించేసింది. పాకిస్తాన్ కు చెందిన ఎఫ్ 16 విమానం యాక్టివ్ అయ్యేలోపే…భారత ఆర్మీ పనిముగించుకుని తిరిగి వచ్చింది.
నాలుగేళ్ల క్రితం జరిగిన ఘటన ఇప్పటికీ ప్రతి భారత పౌరుడి మదిలో మెదలుతూనే ఉంటుంది. పుల్వామా దాడి ఘటన గుర్తు తెచ్చుకుంటే మనస్సు కలుక్కుమంటుంది. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తో భారతఆర్మీ సత్తా ప్రపంచానికి తెలిసింది. ముఖ్యంగా పాకిస్తాన్ వెన్నులో వణుకుపుట్టేలా చేసింది.