ఇండియన్ బ్యాంకు సంచలన ప్రకటన.. వారు అనర్హులు - MicTv.in - Telugu News
mictv telugu

ఇండియన్ బ్యాంకు సంచలన ప్రకటన.. వారు అనర్హులు

June 16, 2022

ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ సంచలన ప్రకటన చేసింది. తమ బ్యాంకులో చేరడానికి 3 నెలలు దాటిన గర్భిణులు అనర్హులని స్పష్టం చేసింది. ప్రీ-ఎంప్లాయ్‌మెంట్‌కు సంబంధించి, ఫిజికల్ ఫిట్నెస్ మార్గదర్శకాలను ఇటీవలే బ్యాంకు విడుదల చేసింది. ఎంపిక చేసిన పోస్టులకు నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాధించిన మహిళలు 12 వారాలు, అంతకుమించిన గర్భంతో ఉంటే, తాత్కాలికంగా అనర్హులవుతారని అందులో పేర్కొంది.

ప్రసవం అనంతరం ఆరు వారాలకు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ వద్ద ఫిట్నెస్ పరీక్షలు చేయించుకుని, ధ్రువీకరణలో వస్తే, నియామక ఉత్తర్వులు అందిస్తామని బ్యాంక్ వెల్లడించింది. అలా ఆలస్యంగా ఉద్యోగాల్లో చేరే గర్భిణులు సీనియారిటీ కోల్పోయే ప్రమాదం ఉందని ఆలిండియా డెమొక్రటిక్ ఉమెన్ అసోసియేషన్ తెలిపింది. ఇండియన్ బ్యాంక్ ప్రకటించిన ఈ నిర్ణయం మహిళలకు వ్యతిరేకంగా ఉందని పలువురు బ్యాంకు అధికారులు, బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్ధులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు.

మరోపక్క ఈ విషయంపై ఆలిండియా వర్కింగ్ ఉమెన్ ఫోరమ్ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసింది.”స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కూడా ఇలాగే, గతంలో 3 నెలల గర్భిణులు బ్యాంకులో చేరడానికి తాత్కాలికంగా అనర్హులని, ప్రసవానంతరం 4 నెలలకు విధుల్లో చేరొచ్చని, గత సంవత్సరం జనవరిలో మార్గదర్శకాలను జారీ చేసింది. దాంతో అభ్యర్థులు, పలువురు ఉద్యోగస్థులు తీవ్రంగా మండిపడూతూ, ధర్నాలు, నిరసనలు చేసి, అధికారులకు వినతిపత్రాలను అందజేశారు. దాంతో చర్చోపచర్చలు జరిపిన ఎస్బీఐ ఆ నిబంధనలను రద్దు చేసింది.” అని ఆ లేఖలో వారు పేరొన్నారు. ఈ క్రమంలో ఇండియన్ బ్యాంకు చేసిన ప్రటనను వెనక్కి తీసుకుంటుందా? ఫిజికల్ ఫిట్నెస్ మార్గదర్శకాలను పాటిస్తుందా? అనే చర్చ మొదలైంది.