మహిళా క్రికెటర్ దీప్తిశర్మ టీ20 క్రికెట్‌లో దేశం తరపున తొలి బౌలర్‌గా అవతరించింది. అటు పురుషులు, ఇటు మహిళా ఆటగాళ్లతో పోలిస్తే పొట్టి ఫార్మాట్‌లో వంద వికెట్ల మైలురాయిని అందుకున్న మొదటి బౌలర్‌గా రికార్డు సృష్టించింది. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా బుధవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచులో 3 వికెట్లు పడగొట్టి దీప్తిశర్మ ఈ ఘనతను సొంతం చేసుకుంది. మొత్తం 89 మ్యాచుల్లో దీప్తి ఈ మార్కును అందుకుంది. తర్వాత స్థానంలో తోటి బౌలర్ పూనమ్ యాదవ్ 72 మ్యాచుల్లో 98 వికెట్లతో ఉంది. ఇక మెన్స్ క్రికెట్‌లో చహల్ 75 మ్యాచుల్లో 91 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 87 మ్యాచుల్లో 90 వికెట్లతో ఈ మైలురాయికి చేరువలో ఉన్నారు.
అటు ప్రపంచవ్యాప్తంగా వంద వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో దీప్తిశర్మ 9వ స్థానంలో నిలిచారు. దీప్తి కంటే ముందు వెస్టిండీస్ స్పిన్నర్ అనీసా మహ్మద్ (125 వికెట్లు), పాకిస్తాన్ బౌలర్ నిదాదార్ (121), ఆస్ట్రేలియా బౌలర్ ఎలిస్ పెర్రీ (120) ఉన్నారు. మెన్స్ క్రికెట్‌లో ఐదుగురు ఉన్నారు. టిమ్ సౌథీ (134), షకీబ్ అల్ హసన్ (128), రషీద్ ఖాన్ (122), ఇష్ సోదీ (114), లసిత్ మలింగ (107) ఉన్నారు. ఇక తాజాగా జరుగుతున్న మ్యాచులో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసి ఆరు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. భారత్ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. హిట్టర్ రిచా ఘోష్ 44 నాటౌట్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 33, ఓపెనర్ షఫాలీ 28 పరుగులతో రాణించారు. భారత్‌కిది వరుసగా రెండో విజయం. తొలిమ్యాచులో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.