ఏడాదిగా సాగుతున్న రష్యా, ఉక్రెయిన్‌ల యుద్ధం విషయంలో భారత్ తటస్థ వైఖరి అవలంబిస్తోంది. అయితే కొంతమంది భారతీయులు రష్యాపై కోపంతో ఉక్రెయిన్‌కు సాయం చేస్తున్నారు. యూపీలోని భాగపట్‌కు చెందిన బ్రిజేంద్ర రాణాలో వారిలో ముందుంటారు. ఆయన ఉక్రెయిన్‌కు ఇంతవరకు 40 కోట్ల రూపాయలకుపైగా సాయం అందించాడు. మన దేశంలో ఆయన ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారో తెలియదు గాని ఉక్రెయిన్‌కు భారీ సాయం చేసి అంతర్జాతీయ వార్తల్లోకి ఎక్కారు.
యుద్ధ బాధితులకు, ఉక్రెయిన్ సైనికులకు కావాలసిన అన్ని రకాల మానవతా సాయాన్ని రాణా సరఫరా చేశారు. ఆహారం, ఔషధాలు, దుస్తులు వంటివెన్నో ఇందులో ఉన్నాయి. ఈ సాయానికి బలమైన కారణమే ఉంది. రాణా ఉక్రెయిన్‌లోని ఖార్కీవ్ నగరంలోనో వైద్య విద్య అభ్యసించారు. పట్టా పుచ్చుకున్న తర్వాత అక్కడ ‘అనంత’ పేరుతో ఫార్మా కంపెనీ స్థాపించి భారీ లాభాలు ఆర్జించాడు. ఖార్కీవ్ సహా ఉక్రెయిన్ అంతటా రష్యా భీకర దాడులు జరుపుతున్నా రాణా మాత్రం ఉక్రెయిన్ పై ప్రేమతో అక్కడే ఉండిపోయారు. దాడుల్లో గాయపడిన ప్రజలకు చేతికి ఎముక లేకుండా సాయం చేస్తున్నారు. అతని సేవలకు గుర్తింపుగా ఉక్రెయిన్ ఆర్మీ దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘బ్యాడ్జ్ ఆఫ్ ఆనర్’ తో సత్కరించింది. ఉక్రెయిన్ సాయుధ బలగాల అధిపతి రాణాకు ఈ మెడల్ అందించి ప్రశంసల వర్షం కురిపించారు.