దేశంలో జాబ్స్ ఉన్నాయి, అర్హులే లేరు..కేంద్ర కార్మిక మంత్రి
దేశంలో ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం పెరిగిపోతున్నాయని అనేక సర్వేలు హెచ్చరిస్తున్న సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వర్ చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఉత్తర ప్రదేశ్‌లోని బరేలిలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..దేశంలో ఉద్యోగాలు చాలానే ఉన్నాయని, అయితే ఆ ఉద్యోగాలకు సరిపోయే అర్హులే లేరంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తన మంత్రిత్వ శాఖనే ఉద్యోగ పరిస్థితిని పర్యవేక్షిస్తోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశంలో ఉపాధి రహిత పరిస్థితికి ఉత్తరభారతీయులే కారణమన్నారు. ఆర్థిక మాంద్యంపై తమకు ఆందోళన ఉన్నా దేశంలో ఉపాథి అవకాశాలకు ఢోకా లేదన్నారు. దేశాన్ని సందర్శిస్తున్న విదేశీ కంపెనీలు.. ఇక్కడి యువతలో తమకు కావాల్సిన అర్హులు లేరని తనతో చెప్పినట్లు ఆయన తెలిపారు. భారతదేశంలో ఉద్యోగాలకు కొరత లేదని గంగ్వర్ తేల్చి చెప్పారు. 2014 ఎన్నికల ప్రచారంలో బీజేపీ పార్టీ ఇచ్చిన ప్రధానమైన హామీల్లో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగావకాశాలు ఒకటి. అయితే మోదీ ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకొని రెండో పర్యాయం పాలన ప్రారంభమై 100 రోజులు పూర్తైంది. అయినప్పటికీ ఉద్యోగ కల్పనలో ప్రభుత్వ లక్ష్యం నేరవేరలేదు. ప్రధాని సహా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు బయటికి వెళ్తే నిరుద్యోగం గురించి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి.