కరోనా ఫైట్.. మన సీఎంల పనితీరు ఎలా ఉంది? ఎవరేం చేస్తున్నారు?    - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా ఫైట్.. మన సీఎంల పనితీరు ఎలా ఉంది? ఎవరేం చేస్తున్నారు?   

April 10, 2020

మానవజాతి ఇటీవలి చరిత్రలో కరోనా విలయం లాంటిది మరొకటి లేదు. వందకుపైగా దేశాలు లాక్‌డౌన్ అయ్యాయంటే పరిస్థితిని అంచనా వేయొచ్చు. అటు జపాన్ నుంచి ఇటు అమెరికా దాకా కరోనా దాడిలో లక్షమంది ప్రాణాలు కోల్పోగా 15 లక్షల మంది దాని కోరల్లో చిక్కుకున్నారు. భారత్ పరిస్థితి కాస్త నయంగానే ఉన్నా కేవలం 2 లక్షల మందికే పరీక్షలు చేయడంతో అసలు వ్యాధి వ్యాప్తి ఎలా ఉందో తెలియడం లేదు. ఉన్న కొద్దిపాటి వనరులతోనే అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు అన్ని శక్తులను ఒడ్డి మహమ్మారిపై పోరాడుతున్నాయి. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలుమార్లు జాతినుద్దేశించి ప్రసంగాలు చేశారు. అందరూ ఇళ్లలోనే ఉండాలని, వైద్యారోగ్య సిబ్బందికి పోలీసులకు సహకరించాలని కోరారు. కేంద్రం రూ. 1.70 లక్షల ప్యాకేజీకూడా ప్రకటించింది. అయితే 130 కోట్ల జనాభాకు ఇది ఎంతమాత్రం సరిపోదు. అందుకే రాష్ట్రాలు సొంత వనరులను వెచ్చించి, ఉద్యోగుల జీతాలకు కోతలు పెట్టి మరీ పోరాడుతున్నాయి. కొందరు ముఖ్యమంత్రులు యుద్ధప్రాతిపదిక పనిచేస్తున్నారు. ప్రజలను కరోనా బారి నుంచి రక్షించడమే తమ తొలి కర్తవ్యవమన్నట్లు పనిచేస్తున్నారు. తమ జీతాలకు కోతవేయడం దగ్గర్నుంచి ప్రజలకు, కరోనాపై ప్రత్యక్షంగా పోరాడుతున్నవారికి ప్రోత్సహకాల వరకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. మరి మన ముఖ్యమంత్రుల్లో కరోనాపై ఎవరు ఎలా పోరాడుతున్నారో తెలుసుకుందామా? 

యోగి ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కరోనాపై జీవనోపాధి కోల్పోయిన వలసకార్మికులు భారీ ఊరట కల్పించారు. కూలీలకు రోజుకు వెయ్యి ప్రకటించారు. లాక్ డౌన్‌లో చిక్కుకుపోయిన వారిని స్వస్థలాలకు చేర్చడానికి వెయ్యి బస్సులును కూడా కేటాయించారు. దీంతో ఢిల్లీ, ఘజియాబాద్ తదితర ప్రాంతాల్లోని వలసకూలీలు బతుకు జీవుడా అంటూ ఇళ్లకు చేరుకున్నారు. పేదలకు నిత్యావసరరాల పంపిణీ కూడా యోగి సమర్థమంతంగా చేపట్టారు. కరోనాపై ఉదారంగా స్పందించిన తొట్టతొలి సీఎంగా ప్రశంసలు అందుకున్నారు. 

కేసీఆర్

తెలంగాణ సీఎం కూడా పెద్దమనసుతో స్పందిస్తున్నారు. ఒక్కో కుటుంబానికి నిత్యావసరాలతోపాటు రూ. 1500, వలస కూలీలలకు 12 కేజీల బియ్యం, రూ. 500 అందిస్తున్నారు. వైద్య, పారిశుద్ధ్య కార్మికులకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడుకోవడమే తన ప్రథమ బాధ్యత అని స్పష్టం చేస్తున్నారు. వలస కూలీలను కడుపులో పెట్టుకుని చూసుకుంటామన్న కేసీఆర్ ఈ విపత్కర పరిస్థితిలోనూ అన్నపూర్ణ కేంటీన్లను తెరిపించి వలస కూలీల, నిరుపేదల కడుపు నింపుతున్నారు. రాష్ర్టంలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. వివిధ జిల్లాల్లో కరోనా ఆస్పత్రులను ఏర్పాటు చేస్తూ నిత్యం అప్రమత్తంగా ఉంటున్నారు. 

జగన్ మోహన్ రెడ్డి 

ఆంధ్రప్రదేశ్‌లో ఇంతవరకు 6 కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. వైద్యులు అంకితభావంతో చికిత్స చేస్తున్నారు. ప్రజలకు నిత్యావసరాలు ఇంటికే వస్తున్నాయి. వీటివెనుక సీఎం జగన్ మోహన్ రెడ్డి కృషి ఉంది. పేదలకు నిత్యావసరాలతోపాటు పాటు రూ. వెయ్యి అందిస్తున్నారు. కరోనా కేసులపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ అధికారులను అలర్ట్ చేస్తున్నారు. 

కేజ్రీవాల్

హస్తిన పాలకుడు భవన నిర్మాణ కూలీలకు రూ. 5 వేల సాయం ప్రకటించారు. ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు సమకూరుస్తూ కరోనా చికిత్స పకడ్బందీగా సాగిస్తున్నారు. ప్రజలు నిత్యావసరాలకు ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. కరోనా రోగులను గుర్తించి చికిత్స చేయించడానికి ఐదుసూత్రాల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. 

పినరయి విజయన్

కరోనా తొలి దశలో వణికిపోయిన కేరళలో వైరస్ ప్రస్తుతం అదుపులోనే ఉందంటే రాష్ర్ట ప్రభుత్వం కృషే కారణం. సీఎం పినరయి విజయన్ యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని ఎక్కడికక్కడ క్వారంటైన్ చేశారు. ప్రజలు ఇబ్బంది పడకుండా 17 రకాల వస్తువులున్న ప్యాకెట్లను ఇంటింటికీ సరఫరా చేస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా కరోనా టెస్ట్ కియోస్క్ లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా కేవలం రెండే నిమిషాల్లో బాధితుల నుంచి నమూనాలు తీసుకుంటున్నారు. కోరాపై పోరాటానికి దేశంలో తొలిసారిగా రూ. 20 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. ఇందులో 5 వేల కోట్లను జీవనోపాధి కోల్పోయిన వారికి సాయంగా అందజేస్తున్నారు. 

వీరితోపాటు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, బిహార్ సీఎం నితీశ్ కుమార్, పశ్చిమ బెంగాల్ సీఎ మమతా బెనర్జీ,  హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, కర్ణాటక సీఎం యడియూరప్పలు కూడా కరోనాను తరిమేయడానికి, ప్రజలను ఆదుకోడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. కర్ణాటకలో పేదలకు పాలను ఉచితంగా ఇస్తుండగా, హరియాణాలో వైద్యసిబ్బందికి జీతం రెట్టింపు చేశారు.