భారత పుత్రిక వచ్చేసింది. - MicTv.in - Telugu News
mictv telugu

భారత పుత్రిక వచ్చేసింది.

May 25, 2017

పాకిస్థాన్‌ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయ మహిళ ఉజ్మాకు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ స్వాగతం పలికారు. ఉజ్మాను ‘భారత పుత్రిక’గా అభివర్ణించారు.
పాకిస్థాన్‌ వ్యక్తి తుపాకీతో బెదిరించి బలవంతంగా పెళ్లి చేసుకుని తీసుకెళ్లాడని భారత దౌత్యాధికారులను ఆశ్రయించిన ఉజ్మాకు ఇస్లామాబాద్‌ హైకోర్టులో వూరట కలిగింది. ఆమె స్వదేశానికి వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. దీంతో ఉజ్మా గురువారం భారత్‌కు చేరుకుంది. కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ ట్విటర్‌ వేదికగా ఆమెకు స్వాగతం పలికారు. ‘భారత పుత్రిక.. నీకు సాదర స్వాగతం. నీవు ఎదుర్కొన్న పరిస్థితులన్నింటికీ నేను క్షమాపణ చెబుతున్నా’ అని సుష్మా ట్వీట్‌ చేశారు.
పాకిస్థాన్‌కు చెందిన తాహిర్‌ అనే వ్యక్తి తన తలకు తుపాకీ గురిపెట్టి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని, అతడి నుంచి రక్షించాలని కోరుతూ ఉజ్మా ఇస్లామాబాద్‌లోని భారత దౌత్యకార్యాలయాన్ని ఆశ్రయించింది. దీంతో ఉజ్మాను స్వదేశానికి పంపించాలంటూ అక్కడి అధికారులు ఇస్లామాబాద్‌ హైకోర్టులో కేసు వేశారు. ఈ కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం ఉజ్మా భారత్‌కు వెళ్లేందుకు అనుమతినిచ్చింది. దీంతో ఆమె పూర్తి రక్షణ మధ్య వాఘా భారత్‌లోకి ప్రవేశించారు.
కోర్టు తీర్పుపై ఉజ్మా సోదరుడు వసీమ్‌ అహ్మద్‌ ఆనందం వ్యక్తం చేశారు. తన సోదరికి అండగా ఉన్న కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌కు, భారత అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘సుష్మాజీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు’ అని అన్నారు.