ప్రపంచంలోని ఏడు ఖండాలను వీలైనంత వేగంగా ప్రయాణించి ప్రపంచ రికార్డును డా. అలీ ఇరానీ, సుజోయ్ కుమార్ మిత్ర విజయవంతంగా అధిగమించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా వీరి రికార్డును ధృవీకరించింది. అంటార్కిటికా, దక్షిణ అమెరికా, యూరప్, ఉత్తర అమెరికా, ఆఫ్రికా, ఆసియా, ఓషియానియాలోని ఏడు ఖండాలను చాలా తక్కువ సమయంలో దాటేశారు ఇద్దరు. వీరిద్దరూ 3 రోజుల 1 గంట 5 నిమిషాల 4 సెకన్లలో ఈ యాత్రను పూర్తి చేశారు. అంటార్కిటికాలో డిసెంబర్ 4, 2022న ప్రారంభించి, 7 డిసెంబర్ 2022న ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో తమ ప్రయాణాన్ని ముగించారు డాక్టర్ ఇరానీ, సుజోయ్ మిత్రా.
ప్రయాణమే పరమావధిగా..
మిత్రా, డాక్టర్ ఇరానీ ఇద్దరూ ఆసక్తి గల ప్రయాణీకులు. డాక్టర్ ఇరాన్ 64 ఏళ్ల వయసులో భారత క్రికెట్ జట్టుకు ఫిజియోథెరపిస్ట్ గా పని చేస్తున్నారు. అతను ఇప్పటివరకు 90 దేశాలకు పైగా పర్యటించాడు. సుజోయ్ కూడా తన ప్రయాణ వెంచర్ ను ఎప్పుడో ప్రారంభించాడు. తను ఇప్పటికే అధికంగా ప్రయాణించే భారతీయుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఇప్పటికే అతను ప్రపంచవ్యాప్తంగా ఉన్న 198 దేశాల్లో మొత్తం 172 దేశాలను కవర్ చేశాడు.
పాత రికార్డు..
2020 ఫిబ్రవరిలో 3 రోజుల 14 గంటల 46 నిమిషాల 48 సెకన్లలో యూఏఈకి చెందిన డాక్టర్ ఖవ్లా అల్ రొమైతి ఏడు ఖండాలను అత్యంత వేగంగా ప్రయాణించినందుకు రికార్డు సంపాదించాడు. అతని రికార్డును బద్దలు కొట్టి సుజయ్ మిత్రా, డాక్డర్ ఇరానీ ఈ రికార్డును 13 గంటల ముందే ముగించేశారు. గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టడం పట్ల చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా..
డాక్టర్ అలీ.. ‘ప్రయాణం సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను ఏకం చేస్తుంది. మేమిద్దరం చాలా మక్కువతో ఈ రికార్డును సాధించాం. ఈ విజయాన్ని మేం ఆస్వాదిస్తున్నాం’ అని చెప్పారు. అలాగే సుజయ్ మిత్రా.. ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ గా ఉండటం గౌరవంగా ఉంది. అయితే రికార్డులు బద్దలు కొట్టాలని ముందు అనుకొని ప్రయాణాన్ని మొదలు పెట్టాం. ఈ ప్రయాణం ముగిసి ఉండవచ్చు. కానీ మేం సాధించేందుకు ఇంకా చాలా మైలు రాళ్లు ఉన్నాయి. మేం సాధించిన విజయాన్ని రేపు పొద్దున మరొకరు బద్దలు కొట్టవచ్చు. కాబట్టి పోరాటాన్ని ఆపొద్దు అనుకుంటున్నా. కష్టాలను ఆస్వాదించాలి’ అంటూ చెప్పాడు.