దేశాన్ని దరిద్రదేవత ఆవహిస్తోందా? జీడీపీ లెక్కలు ఏం చెబుతున్నాయి?  - Telugu News - Mic tv
mictv telugu

దేశాన్ని దరిద్రదేవత ఆవహిస్తోందా? జీడీపీ లెక్కలు ఏం చెబుతున్నాయి? 

September 3, 2019

దేశం ఆర్థికమాంద్యం అంచులో నిలబడిందా? ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, వాస్తవాలకు పొంతన ఉండడం లేదా? వాస్తవాలను దాచిపెట్టడానికే కశ్మీర్ అంశాన్ని తెరపైకి తెచ్చారన్న విపక్షాల ఆరోపణల్లో నిజమెంత? అసలు మన ఆర్థిక ముఖచిత్రం ఏంటి? 

indian economic slowdown gdp analysis 

వర్షం వెలిసింది. ఇంటి బయటకు వచ్చి  అలా నాలుగడుగులు వేసి వేడివేడి బజ్జీలు తిందామనుకున్నాడు సుబ్బ్బారావు. రోడ్డు మీద 500 రూపాయల నోటు కనిపించింది.  లటుక్కున తీసి చటుక్కున జేబులో వేసుకున్నాడు. తర్వాత  గణపతి చందాలకు ఇవ్వచ్చులే, పుణ్యం తన ఖాతా లోకి వెళ్తుంది ఫ్రీగా అని అనుకున్నాడు. బజ్జీల కోసం పోతూపోతూ ఉండగా పిల్లవాడికి కొనాల్సిన  పుస్తకాలు గుర్తుకు వచ్చాయి. పుస్తకాల షాపు లోకి దూరి 500 రూపాయల పుస్తకాలు కొనేశాడు.  హమ్మయ్య ఒక ఖర్చు తగ్గిందిలే అనుకున్నాడు. తర్వాత ఆ పుస్తకాల షాపు వాడు ఆ 500 రూపాయల నోటుతో ఓ హాఫ్ బాటిల్ మందు, స్టఫ్ కొనుక్కుని రాత్రికి ఇంటికి పోయాడు. వైన్ షాపు యజమాని ఆ ఐదొందల నోటు తీసుకుని తన ఫేవరేట్ హీరో సినిమాకు వెళ్లాడు.  ఇంటర్వెల్లో పాప్ కార్న్ , కూల్ డ్రింకులకు దాన్ని తగలేశాడు. ఆ సినిమా వాడు తన కారు డ్రైవర్ లేకపోవడంతో  అదే 500 రూపాయలతో టాక్సీ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. 

ఇక్కడ ఎం జరిగింది? 500 రూపాయల నోటు కదలిక సుబ్బారావు దగ్గర మొదలై మిగతా అందరినీ కదిలించి చివరకు ఫలానా అప్పారావు దగ్గర ఆ రోజుకు ఆగిందనుకుందాం. 500 రూపాయల నోటు మొత్తం నాలుగు సార్లు కదిలి 2000 రూపాయల విలువ చేసే ఆర్ధిక చర్యను నడిపింది. అదే అర్థంలో 500 రూపాయల నోటు 2000 రూపాయల విలువగల  జీడీపీ(స్థూల జాతీయోత్పత్తి)  భారత దేశానికి కలిపింది. ఇందులో ఏ ఒక్కరైనా 500 రూపాయల్ని ఖర్చు చెయ్యకుండా బ్యాంకులో పడేస్తే ఆ వ్యవహారం అక్కడితో ఆగిపోయేది. 

 

జీడీపీ మొత్తం వస్తువుల, సేవలు  అవి కొన్నప్పుడు లేదా పొందినప్పుడు ఒక దేశంమొత్తం మీద లెక్కించినప్పుడు వచ్చే ఒక సూచిక. అది డబ్బు లేదా కరెన్సీ కదలికను సూచిస్తుంది. ఎన్ని సార్లు కరెన్సీ కదిలితే అంత ఎక్కువ జీడీపీ అన్నమాట. ఒకరి ఖర్చు ఇంకొకరికి రాబడి. ఇది నిరంతరం తిరిగే చక్రం లాంటిది. ఈ చక్రం ఎంత బాగా తిరిగితే అంత మేలు అన్న మాట దేశ ఆర్థిక ఆరోగ్యానికి.

జీడీపీ పడిపోతుందంటే అర్థం ఇప్పుడు ఆ చక్రం తిరగడం మందగించిందని. 2019 మొదటి త్రైమాసికంలో 5.8% నుంచి ఆ చక్రం వేగం బ్రేకులు వేసినట్టు లేక బెరింగులు అరిగిపోయి మొరాయించినట్టు నత్త నడకన సాగుతోంది. ఆ తర్వాత త్రైమాసికంలో ఆర్థిక కుదుపులు చూసాక అది మరింత పడిపోయి 5.0% కు చేరుకుంది. 

 

జీడీపీని ఎలా లెక్క కడతారు

Image result for gdp count

ఒక పరిమిత కాలానికి  ప్రైవేటు రంగం చేసే ఖర్చు, ప్రభుత్వ పెట్టుబడులు, చేసే ఖర్చులు, చేసే ఎగుమతుల నుంచి  దిగుమతులు మొత్తాన్ని తీసేస్తే వచ్చేదే జీడీపీ. అది అంచనా వేసేందుకు వివిధ రంగాల్లో ఉండే సూచీలు పనికివస్తాయి. 

 

వినియోగ సూచి : మొత్తం జనాభా చేసే వస్తు సేవల వినియోగం భారత దేశ ఆర్థిక వ్యవస్థలో సింహభాగం.. అంటే మూడొంతులు ఉంటుంది. వివిధ రంగాలకు సంబంధించి జరిగే వినియోగం తగ్గితే మొత్తం ఆర్ధిక వ్యవస్థ  మందగించినట్టే. బ్యాంకులు ఇచ్చే రుణాల్లో తప్ప అన్ని రంగాల్లో ఇప్పుడు వినియోగ సూచీలు దారుణంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

 

పడిపోతున్న కార్ల అమ్మకాలు

Image result for cars in showroom in india

మన దేశంలో ఏప్రిల్  నుంచి జూన్ 2019 మధ్యలో కార్ల అమ్మకాలు గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే  23.3% శాతం తగ్గాయి. ఇది 2004 నుంచి రికార్డు అయిన అమ్మకాలలో అన్ని సంవత్సరాల కనిష్టం. (అంత కంటే వెనక్కి వెళ్లే లెక్కలు లేవు). కార్ల అమ్మకాలు తగ్గాయంటే వాటితో ముడిపడి ఉండే విడి భాగాల అమ్మకాలు కూడా తగ్గినట్టే. ఉదాహరణకు టైర్ల అమ్మకాలు ఉక్కు ముడిభాగాల అమ్మకాలు పడిపోయినట్టే. దాంతోపాటు ఆటో డీలర్లు తమ ఆదాయాన్ని కోల్పోయి, దుకాణాలను  బందు పెట్టుకుంటారు. ఇదే సమయంలో కార్ల కోసం తీసుకునే లోన్లు కూడా(5.1  శాతానికి) తగ్గాయి. కార్లతో పోలిస్తే టూవీలర్ల అమ్మకాలు 11.7 శాతం తగ్గి కాస్త మెరుగు అనిపించుకున్నాయి. 2008 ఆర్థిక మాంద్యం సమయంలో అది 14.8 శాతమే.  వ్యవసాయ పనులకు వినియోగ పడే ట్రాక్టర్ల అమ్మకాలు 14.1 శాతం పడిపోయాయి.

ఇంటి నిర్మాణం, అమ్మకాలు

Image result for house building in india

లియాసిస్ ఫారెస్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ లెక్కల ప్రకారం ఇండియాలోని 30 అతిపెద్ద నగరాల్లో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 7 శాతం పెరిగింది. (12 లక్షల నుండి 12.8 లక్షల ఇళ్లు). ఇళ్ల నిర్మాణం, అమ్మకాలు మీద ప్రధానంగా అధారపడ్డ రియల్ ఎస్టేట్ రంగం,  దానితో సంబంధం ఉన్న ఉక్కు, సిమెంట్, పెయింట్, ఫర్నిచర్ అమ్మకాలు సరే సరి. రియల్ ఎస్టేట్ రంగం కొన్ని నెలలగుగా స్తంభించి పోయింది. జనాలు పెట్టుబడులు పెట్టడం మనసి డబ్బు దాచుకోవడం మొదలు పెట్టారన్న మాట. ఇది ఏ దేశ ఆర్ధిక వ్యవస్థకైనా ముప్పే.

 

బ్యాంకు రుణాలు

Image result for bank loans in india

ఆశ్చర్యంగా బ్యాంకులో తీసుకునే రిటైల్  రుణాలు దాదాపు ఒక శాతమే(17.9 శాతం నుండి 16.6 శాతం )  తగ్గాయి. హౌసింగ్ లోన్లు (15.8%నుండి 18.9%) కొంత పెరుగుదలను నమోదు చేసుకున్నాయి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రజలు బిల్డర్ల నుండి కొత్త ఇళ్ళకు బదులు అంతకుముందే  కొన్న ఇన్వెస్టర్ల నుంచి ఇళ్లు కొనుక్కుంటున్నారు. దీంతో ఇతర నిర్మాణ రంగాలకు జరిగే మేలు దాదాపు శూన్యం. 

ఇది కాకుండా క్రెడిట్ కార్డుల నుంచి చేసే ఖర్చు కూడా పెద్దగా తగ్గలేదు(31.3% నుండి  27.6%). ప్రభుత్వ అనుకూలురు చేసే వాదనకు ఇది బాగా పనికి వచ్చే అంశం. జనాల కొనుగోలు  శక్తి తగ్గిపోతే మరి షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు  ఎందుకు ఇంకా కిటకిటలాడు తున్నాయి? ఆ కాస్త సరదాలు జనం మానేయలేదు ఇంకా.   

రోజువారి సరుకుల అమ్మకాలు

Image result for fmcd

వేగంగా అమ్ముడు పోయే వస్తువుల కంపెనీలు (ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్) గత సంవత్సర కాలంగా మందగమనం బాట పట్టాయి. హిందూస్తాన్ యూనీలీవర్ అమ్మకాలు 12 శాతం నుండి 5 శాతానికి, డాబర్ ఇండియా అమ్మకాలు 21 శాతం నుండి 6 శాతానికి.  బ్రిటానియా అమ్మకాలు 13 శాతం నుండి 6 శాతానికి పడిపోయాయి. పార్లేజీ బిస్కెట్ల కంపెనీ నష్టాల బారిన పడి పదివేల మంది ఉద్యోగులను ఇంటికి పంపడానికి సిద్ధమైంది.  

 

నాన్ ఆయిల్, నాన్ సిల్వర్ దిగుమతులు

ఇవి గత సంవత్సరం‌తో పోలిస్తే 6.3 శాతం నుండి 5.3 శాతానికి పడిపోయాయి. ఇది కొంత సానుకూల అంశమే. దిగుమతులు తగ్గితే మేలే కదా. 

 

తక్షణ పెట్టుబడులు

Image result for investments in india

ఇవి జీడీపీకి ఆయువుపట్టు లాంటివి. పెట్టుబడులు పెరిగితే  వస్తు, వినియోగం పెరుగుతాయి. ఉద్యోగాలూ వస్తాయి. అయితే దురదృష్టవశాత్తు తక్షణ పెట్టుబడులు సంఖ్య ఆశాజనకంగా ఏమీ లేదు. వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే  వాహనాల అమ్మకాలు ఆర్ధిక వృద్ధిని, పారిశ్రామిక రంగంలో అభివృద్ధిని సూచిస్తాయి. ఆ వాహనాలు ముడి సరుకులు, ఇతర సామాగ్రిని చేరవేస్తాయి కనుక. ఈ వాహనాల అమ్మకాలు కూడా (51.6%.నుండి 9.5%) మరీ ఘోరంగా పడిపోయాయి. 

 

బ్యాంకులు పరిశ్రమ రంగానికి ఇచ్చే అప్పులు 

ఇవి రెండేళ్లుగా  ౦.9 శాతం నుంచి అమాంతం 6 .5 శాతానికి చేరుకున్నాయి.  బడా పారిశ్రామికవేత్తలకు ఇచ్చే అప్పులు  ఏడుశాతం పెరిగాయి. అదే సమయంలో చిన్న మధ్య స్థాయి పరిశ్రమలకు ఇచ్చే రుణాలు 0 .7శాతం నుండి 0 .6 శాతం తగ్గాయి. పెద్ద పరిశ్రమలకు రుణాలు ఇవ్వడంతో పాటు ఎక్కువ శాతం ఉపాధి అవకాశాలు కల్పించే చిన్న,మధ్య స్థాయి పరిశ్రమలకు రుణాలు ఇవ్వడం దేశ అభివృద్ధికి అత్యవసరం.

 

రైళ్ల రవాణా

Image result for rail freight in india

భారత రైల్వే రంగానికి వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం బొగ్గు, ఉక్కు, ఆయిల్, ముడి సరుకుల రవాణా నుంచే వస్తోంది. రైలు బండి చకచకా నడిస్తే  పరిశ్రమల్లో పెట్టుబడులు పెరిగి ఉత్పత్తి పెరిగినట్టు. ఈ రంగంలోనూ వృద్ధి 6.4% నుండి 2.7% పడిపోయింది. 

 

ఉక్కు వినియోగం

Related image

మౌలిక సదుపాయాల కల్పనకు ఉక్కు అవసరం. ఉక్కు వినియోగం 8.8% నుండి 6.6% శాతానికి పడిపోయింది. ఇది రెండేళ్లలో కనిష్టం. 

 

కొత్త పరిశ్రమలకు పెట్టుబడులు

Image result for investments in india

వీటి విలువ దాదాపు  79.5 శాతం పడిపోయింది. ఇది కూడా 2004 నుండి వేసిన లెక్కలలో కనిష్టం.    (దీని విలువ 71,337 కోట్లు సెప్టెంబర్ 2004 నుండి ఇదే  అత్యల్పం) ఈ ఒక్క సూచిక ఎవరెన్ని ఊదరగొట్టినా, ఎన్ని శుష్క వాగ్దానాలు చేసినా ఆర్థిక భవిష్యత్తుకు డోకా నిచ్చేది.  పోనీ పూర్తి చేసిన ప్రోజెక్టుల సంఖ్య చూసినా గత సంవత్సరంతో పోలిస్తే 48 శాతానికి పడిపోయాయి. ఇది కూడా 2004 నుండి అత్యల్పం. 

ప్రభుత్వ వ్యయం ఎగుమతులపై ఖర్చు

ఇది దాదాపు దేశ ఆర్ధిక వ్యవస్థ లో 11 శాతం ఉంటుంది.  ప్రభుత్వ వ్యయం రెండేళ్లుగా 19.1% నుంచి 13.2% మధ్య రికార్డు అయింది. ఇది ఆర్ధిక మాంద్యం కాలంతో పోల్చి చూసినా అత్యధికం. ప్రభుత్వ వ్యయం పెరిగితే కొంత అభివృద్ధి జరిగే మాట వాస్తవం. దానికి పన్ను వసూళ్లు ముఖ్యమైనవి. ఈ త్రైమాసికంలో పన్ను వసూళ్లలో వృద్ధి 1.4 శాతం. ఇవే పన్ను వసూళ్ల లో వృద్ధి  గత సంవత్సరం 22.1%.

 

ఈ మొత్తం వ్యవహారం చెప్పేది ఒకటే భారత ప్రభుత్వాన్ని  ఆర్థిక సంక్షోభ సెగలు చుట్టుముడుతున్నాయి. ఈ సమయంలో ప్రభుత్వానికి ఎక్కువ   ఖర్చు చేసే దమ్ము అసలు ఉందా అనేది పెద్ద ప్రశ్న. ఉంటే అది ఎక్కడి నుంచి వస్తుంది?  చివరగా ఎగుమతుల విలువ ఏప్రిల్- జూన్ త్రైమాసికానికి 46 బిలియన్లు. ఇది గత సంవత్సరం తో పోలిస్తే సమానం. అంటే ఎగుమతులు దిగుమతుల్లో ఎలాంటి తేడా లేదు. ఎగుమతుల వల్ల వచ్చిన ఆదాయం లో వృద్ధి కూడా ఏమీ లేదు. 

Key indicators that suggest we are well into an economic slowdown

ఇవన్నీ ఆర్థిక మందగమనాన్ని సూచించే లెక్కలు కావు.  సాక్ష్యాలు. భయపెట్టే నిజాలు. ఇవి మన ఘనత వహించిన ప్రభుత్వానికి తప్ప అందరికీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ముఖ్యమైన అసలు ప్రశ్న- సమస్య పరిష్కారం దాన్ని ముందు గుర్తించడంతోనే మొదలవుతుంది. అసలు సమస్యే లేదనడం పలాయనంతో పాటు ద్రోహం కూడా. 

(ఆర్థికవేత్త, ‘ఈజీ మనీ ట్రయాలజీ’ రచయిత వివేక్ కౌల్ ‘లైవ్‌మింట్’కు రాసిన వ్యాసానికి స్వేచ్ఛానువాదం)