ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వర్క్ ఫ్రం హోంపై కేంద్రం మార్గదర్శకాలు
కరోనా వల్ల వచ్చిన లాక్‌డౌన్ అనంతర పరిణామాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పనిచేసే పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. మొదట్లో వర్క్ ఫ్రం హోంకి అలవాటు పడ్డ ఉద్యోగులు ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టినా కూడా అదే విధానానికి మొగ్గు చూపుతున్నారు. కొన్ని కంపెనీలు బలవంతంగా ఆఫీసులకు రమ్మని ఆదేశిస్తున్నా.. ఉద్యోగాలు మార్చుకుంటున్నారే కానీ, ఆఫీసులకు వచ్చి పనిచేయడానికి సిద్ధపడడం లేదు. దీనిని గమనించిన కొన్ని దేశాలు వర్క్ ఫ్రం హోంని చట్టబద్ధం చేశాయి. ఈ క్రమంలో మన దేశంలో కూడా ఈ విధానానికి కేంద్రం తాజాగా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. స్పెషల్ ఎకనమిక్ జోన్స్ (సెజ్)లలో పనిచేసే వాళ్లకు ఏడాది పాటు వర్క్ ఫ్రం హోం చేసుకునే వెసులుబాటు కల్పించింది. మొత్తం ఉద్యోగుల్లో 50 శాతం మందికి ఈ అవకాశం ఇవ్వవచ్చని, కాంట్రాక్టు విధానంలో పనిచేసే వారికి కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. ఒకవేళ 50 శాతానికి మించి ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయాలనుకుంటే.. అలాగే మరో ఏడాది ఈ విధానాన్ని పొడగించుకోవాలంటే అందుకు గల కారణాలను వివరిస్తూ సెజ్ డెవలప్ మెంట్ కమిషనర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సెజ్ ఉద్యోగులతో పాటు ఐటీ, ఐటీఎస్, బీపీవో రంగాల్లోని ఉద్యోగులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.