కేంద్రం కీలక నిర్ణయం.. పోలీసు పతకాల్లో ఫోటో మార్పు - MicTv.in - Telugu News
mictv telugu

కేంద్రం కీలక నిర్ణయం.. పోలీసు పతకాల్లో ఫోటో మార్పు

May 25, 2022

ఆర్టికల్ 370, 35ఎ రద్దు తర్వాత జమ్ము కశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించడం, నియోజకవర్గాల పునర్విభజన, నేరుగా పంచాయితీలకే నిధుల వంటి అంశాలు అందులో ఉన్నాయి. తాజాగా కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. పోలీసులకు ఇచ్చే మెడల్స్‌లో ఇప్పటివరకు ఉన్న షేక్ అబ్దుల్లా ఫోటోను తీసివేసింది. అతని స్థానంలో అశోక స్థంభాన్ని ముద్రించాలని కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక, పతకం పేరును కూడా మార్చేసింది. ఇప్పటివరకు ఉన్న షేర్ ఏ కశ్మీర్ పోలీస్ మెడల్‌గా ఉన్న దాన్ని తాజాగా జమ్ము కశ్మీర్ పోలీస్ మెడల్‌గా మార్చేసింది. కేంద్రం నిర్ణయాన్ని షేక్ అబ్దుల్లా స్థాపించిన నేషనల్ కాన్ఫరెన్స్ వ్యతిరేకించగా బీజేపీ పార్టీ సమర్ధించింది. కాగా, ఒకప్పటి జమ్ముకశ్మీర్ ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి అయిన షేక్ అబ్దుల్లా ఫోటోను ముద్రించాలని ఆయన కుమారుడైన ఫరూక్ అబ్దుల్లా అప్పట్లో నిర్ణయించారు. ఇదిలా ఉండగా, ఇంతకు ముందే షేక్ అబ్దుల్లా పేరిట ఉద్యోగులకు ఇస్తున్న ప్రభుత్వ సెలవును కూడా కేంద్రం తీసివేసింది.