ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై, 2002 గుజరాత్ అల్లర్లలపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీలపై భారత ప్రభుత్వం విరుచుకుపడింది. బ్రిటిష్ పాలకుల మైండ్సెట్ ఇంకా మారలేదంటూ తీవ్ర అభ్యంతరం తెలిసింది. ‘‘వీటిలో మీ వలసవాద మనస్తత్వం, ఆలోచనా ధోరణి కనిపిస్తోంది. అపఖ్యాతి పాలు చేయడానికి వీటిని రూపొందించారు. దీనికి విశ్వసనీయత లేదు.
తప్పుదారి పట్టించేలా ఉంది. గౌరవ మర్యాదలను పాటించలేదు’’ అని విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ విమర్శించారు.
2002నాటి గుజరాత్లో జరిగిన అల్లర్ల కాలంలో మోదీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నా మారణకాండను అడ్డుకోలేకపోయారని డాక్యుమెంటరీలో విమర్శించారు. బ్రిటన్లో రూపొందించిన ఓ అంతర్గత నివేదిక ఆధారంగా దీన్ని తీసినట్లు తెలుస్తోంది.
మోదీపై డాక్యుమెంటరీని భారత ప్రభుత్వం కొన్ని ప్రసార మాధ్యమాలనుంచి తొలగించింది. బ్రిటన్లోనూ బీబీసీ తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. భారతీయ హృదయాలను గాయపర్చారని ఎన్నారైలు, కొందరు బ్రిటిషర్లు కూడా మండిపడున్నారు. ‘ఇండియా.. మోదీ క్వచ్ఛన్’ పేరుతో తీసిన డాక్యుమెంటరీలో, భారత ప్రధాని నరేంద్ర మోదీకి, ముస్లిం సమాజానికి మధ్య ఉద్రిక్తత ఉందని, వెయ్యిమందిని బలితీసుకున్న 2002 అల్లర్లలో ఆయన పాత్ర ఉందనే వాదనలు ఉన్నాయని చెప్పారు.