పాల నాణ్యతను క్షణాల్లో చెప్పే కాగితం - MicTv.in - Telugu News
mictv telugu

పాల నాణ్యతను క్షణాల్లో చెప్పే కాగితం

November 14, 2019

పాల నాణ్యత రోజురోజుకీ తగ్గిపోతుంది. దేశంలో పాల ఉత్పత్తి తగ్గడంతో వ్యాపారాలు పాలను కల్తీ చేస్తున్నారు. పాల నాణ్యత తెలుసుకోవడం కోసం చేసే పరిశోధనలు కొన్ని గంటల సమయం పడుతోంది. దీంతో సామాన్యులు పాల నాణ్యతను తెలుసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో పాల నాణ్యత, తాజాదనాన్ని సామాన్యులు కూడా తెలుసుకునే విధంగా ‘పేపర్‌ సెన్సర్‌’ను ఐఐటీ-గువాహటి పరిశోధకులు కనిపెట్టారు. సాధారణంగా పాలలో సూక్ష్మజీవుల ఉనికి, వాటి స్థాయిని బట్టి పాల నాణ్యత, తాజాదనాన్ని అంచనా వేస్తారు. ఇందుకు ప్రస్తుతం మెథలీన్‌ బ్లూ తదితర పరీక్షలు చేస్తున్నారు. కానీ, వీటిని ప్రయోగశాలల్లో నిపుణులు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఫలితం రావడానికి గంటలకొద్దీ సమయం పడుతుంది. 

Milk.

దీనిపై దృష్టి పెట్టిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రంజల్‌ చంద్ర, కుల్దీప్‌ బృందం సామాన్య ప్రజలు కూడా పాల నాణ్యతను తెలుసుకునే సరికొత్త కాగితం సెన్సర్‌ను రూపొందించింది. పశువుల నుంచి సేకరించిన పాలలో ఆల్కలైన్‌ ఫాస్పేట్‌ అనే ప్రొటీన్‌ ఉంటుంది. ఇది పాల నాణ్యతపై ప్రభావం చూపుతోంది. పాలను మరిగించినప్పుడు ఇది పోతుంది. పాలను పరీక్షించినప్పుడు ఆల్కలైన్‌ ఉందని తేలితే పాలను సరిగా మరిగించలేదని, నాణ్యత దెబ్బతిందని అర్థం. దీనిని దృష్టిలో పెట్టుకుని ఐఐటీ-గవాహటి శాస్త్రవేత్తలు యాంటీ-ఏఎల్‌పీ రసాయనాలతో ప్రత్యేక కాగితాన్ని తయారుచేశారు. ఈ సందర్భంగా పరిశోధకులు మాట్లాడుతూ..’ఆల్కలైన్‌ ఫాస్పేట్‌ ఉన్న పాలలో మేం తయారుచేసిన కాగితాన్ని ఉంచితే… కొద్దిసేపటికి నీలం-ఆకుపచ్చ రంగుల్లోకి మారుతుంది. కాగితం ఎంత ముదురు రంగుల్లోకి మారితే పాలు అంతగా కలుషితమైనట్టు. ఒకవేళ పాలలో ఏఎల్‌పీ లేకపోతే కాగితం సెన్సర్‌ రంగు మారదు.’ అని తెలిపారు.