ఏ దేశమేగినా.. పాక్ మూక చేతిలోంచి ‘భారతి’ని లాక్కుని..  - MicTv.in - Telugu News
mictv telugu

ఏ దేశమేగినా.. పాక్ మూక చేతిలోంచి ‘భారతి’ని లాక్కుని.. 

August 19, 2019

‘ఏ దేశమేగినా.. ఎందు కాలిడిగానా, పొగడరా నీ తల్లి భూమి భారతిని..’ అని పిలుపునిచ్చాడు తెలుగు కవి రాయప్రోలు సుబ్బారావు. ఆ మహిళా విలేకరి అచ్చం అలాంటి పనే చేసింది. అల్లరి మూకల చేతుల్లో అవమానానికి గురవుతున్న‘భారతి’ని వారి చెర నుంచి విడిపించి దేశ గౌరవాన్ని కాపాడింది. లండన్‌లో పంద్రాగస్టున జరిగిన ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఆర్టికన్ 370 రద్దు, కశ్మీర్ విభజనను నిరసిస్తూ లండన్‌లోని భారత రాయబార కార్యాలయం ముందు కొంతమంది కశ్మీరీలతోపాటు పాకిస్తానీలు నిరసన తెలిపారు. పాకిస్తాన్ జెండాలు తీసి ప్రదర్శించారు. భారతీయ జెండాలను అవమానించారు. కొందరు కత్తులు కూడా తీసుకొచ్చారు.  భారత్‌కు, నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుంపులోని ఓ పాకిస్తానీ.. కశ్మీరీల చేతుల్లోంచి భారత జాతిపతాకాన్ని లాక్కుని పాక్ అల్లరిమూక చేతికి అందించాడు. వారు దాన్ని కాళ్ల కింద వేసి తొక్కేయడం, చించేయడం ప్రారంభించారు. నిరసనను కవర్ చేయడానికి వెళ్లిన ఏఎన్ఐ వార్తా సంస్థకు చెందిన భారతీయ విలేకరి పూనమ్ జోషి దూరం నుంచి ఆ దృశ్యాన్ని చూసి కలత చెందారు. పరుగుపరుగునా వెళ్లి అల్లరి మూక చేతుల్లోంచి భారతీయ పతాకాన్న చప్పున గుంజుకున్నారు. ఈ దృశ్యం అక్కడి వీడియోల్లో రికార్డయింది. పూనమ్ జోషి సాహసాన్ని భారతీయులు ప్రశంసిస్తున్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘వారు జెండాను చించేశారు. నేను పోలీసులకు అవతల ఉన్నాను . వెంటనే పరిగెత్తి వారు చించేసిన జెండాను తీసుకున్నాను. ఒకరి చేతిలోంచి మరో ముక్క లాక్కున్నాను.. ’ అని తెలిపారు.