Indian lawn bowls team wins historic gold in Women's Fours
mictv telugu

లాన్ బౌల్‌లో చరిత్ర సృష్టించిన భారత్.. గోల్డ్ మెడల్ కైవసం

August 2, 2022

కామన్వెల్త్ క్రీడల్లో భారత్ నాలుగో స్వర్ణం సాధించింది. ఐదో రోజు మహిళల లాన్ బౌల్స్ ఫైనల్లో భారత్ 17-10తో దక్షిణాఫ్రికాను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. 92 ఏళ్ల కామన్వెల్త్ క్రీడల చరిత్రలో తొలిసారిగా భారత లాన్ బౌల్స్ మహిళల జట్టు పతకం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రీడాకారిణులు లవ్లీ చౌబే, పింకీ, నయన్‌మోని సైకియా, రూపా రాణి టిర్కీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అంతకుముందు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ క్రమంలోనే నేడు జరిగిన తుదిపోరులో దక్షిణాఫ్రికాను చిత్తుచేసిన ఈ బృందం ఈ కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు మరో పసిడి పతకం ఖాయం చేసింది. దీంతో ఇప్పటివరకు భారత్‌ మొత్తం 10 పతకాలు సాధించింది. అందులో నాలుగు బంగారు పతకాలు కాగా, 3 రజతం, 3 కాంస్యాలు ఉన్నాయి.