మామిడిపళ్లు దొంగిలించాడని దేశం నుంచి వెలేశారు.. - MicTv.in - Telugu News
mictv telugu

మామిడిపళ్లు దొంగిలించాడని దేశం నుంచి వెలేశారు..

September 24, 2019

Indian Man, Caught Stealing 2.

మొన్నామధ్య మామిడిపళ్లు దొంగిలించాడని ఓ మనిషిని చంపిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. పళ్లకోసం మనిషిని చంపేంత దారుణాతి దారుణంగా మనుషులు తయారవుతున్నారనే ఆరోపణలు వినిపించాయి. ఇదిలావుంటే ఓచోట మరో రెండు అడుగులు ముందుకు వేశారు. మామిడిపళ్లు దొంగిలించాడని అతన్ని దేశం నుంచే వెలేశారు. సంచనలంగా మారిన ఈ ఘటన అరబ్ కంట్రీస్‌లో చోటు చేసుకుంది. రెండేళ్ల క్రితం అతను మామిడిపళ్లు దొంగిలించాడని ఇప్పుడు కోర్టు అతనికి శిక్ష వేసింది. అతను భారత కార్మికుడు అవడం మరొక విషాదం.

అరబ్ దేశాల్లో న్యాయవ్యవస్థ ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ ఘటన మరో ఉదాహరణగా నిలిచింది. చిన్న చిన్న తప్పులకు కూడా పెద్దపెద్ద శిక్షలు వేయడం వారికే చెల్లింది. చాలాసార్లు అక్కడ నిర్దోషులకు శిక్షలు పడ్డాయనే ఆరోపణలు వున్నాయి. భారత్‌కు చెందిన ఓ 27ఏళ్ల వ్యక్తి దుబాయి ఎయిర్‌పోర్టులో పనిచేసేవాడు. ప్రయాణికుల లగేజీని కంటెయినర్‌ నుంచి కన్వేయర్‌ బెల్ట్‌పైకి ఎక్కించడం, దించడం అతని పని. అయితే అతను 11 ఆగస్టు 2017లో ఎయిర్‌పోర్టులో విధులు నిర్వహిస్తూ ప్రయాణికులకు చెందిన ఓ పండ్ల బాక్సు నుంచి రెండు మామిడి పండ్లు దొంగిలించాడు. ఇదికాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

పోలీసుల విచారణలో అతడు మామిడి పళ్లను దొంగిలించినట్టు ఒప్పుకున్నాడు. తనకు ఆ సమయంలో ఆకలి, దప్పికలు బాగా వుండటంతో ఆ పళ్లను తస్కరించానని చెప్పాడు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. రెండేళ్ల నుంచి ఈ కేసు విచారణలో వుంది. కాగా, ఫస్ట్‌ ఇన్‌స్టాన్స్‌ కోర్టు సోమవారం తుదితీర్పు వెల్లడించింది. అతడికి 5000 దిర్హామ్‌(యూఏఈ కరెన్సీ)ల జరిమానాతో పాటు దేశ బహిష్కరణ విధించింది. ఈ తీర్పుపై అతడు 15 రోజుల్లోగా అప్పీల్‌ చేసుకునే వీలుంటుందని స్పష్టం చేసింది.