డాక్టర్ సుధాకర్..ఏపీ ప్రభుత్వంపై మెడికల్ అసోసియేషన్ కన్నెర్ర
ఆంధ్రప్రదేశ్ కు చెందిన డాక్టర్ సుధాకర్ వ్యవహారం ఎంత సంచలనం అయిందో అందరికి తెల్సిందే. ఈ సంఘటన రాజకీయంగాను పెను దుమారాన్ని రేపింది. అధికార వైసీపీ పార్టీపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేసాయి. మాస్కులు అడిగినందుకు డాక్టర్ను ఇలా శిక్షించడం ఏంటని ధ్వజమెత్తాయి. మచిలీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిలో అనస్థీషియా డాక్టర్‌గా పని చేస్తున్న సుధాకర్ కరోనాతో పోరాడుతున్న డాక్టర్లకు ప్రభుత్వం కనీసం మాస్క్‌లు, పీపీఈ కిట్లు ఇవ్వడం లేదంటూ ఏప్రిల్ 7వ తేదీన ఆరోపించారు. అయితే, ప్రభుత్వం ఆయన్ను 8వ తేదీన సస్పెండ్ చేసింది. తరువాత మే 16న ఆయన విశాఖలో ప్రత్యక్షమయ్యారు. శరీరంపై చొక్కా లేకుండా ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆయన్ను చేతులు వెనక్కు కట్టేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సంఘటనపై తాజాగా సీఎం జగన్‌కు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) లేఖ రాసింది. డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుని ఐఎంఏ తప్పుపట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్ల మనోభావాలు దెబ్బతిన్నాయని లేఖలో తెలిపింది. ఆస్పత్రిలో డాక్టర్ల భద్రతపై మాట్లాడినందుకు ఆయన పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? అని ప్రశ్నించింది. విశాఖలో సుధాకర్ ప్రవర్తించిన తీరును బాగాలేనప్పటికీ.. ఓ ప్రభుత్వ వైద్యుడి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడం సరికాదని అభిప్రాయపడింది. డాక్టర్ సుధాకర్ సస్పెన్షన్‌తో పాటు విశాఖలో జరిగిన ఘటనపై నిష్పక్షపాత విచారణ చేపట్టాలని తెలిపింది. ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐఎంఏ డిమాండ్ చేసింది.