రష్యా దాడిలో భారత వైద్య విద్యార్థి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

రష్యా దాడిలో భారత వైద్య విద్యార్థి మృతి

March 1, 2022

ra

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడులలో భారతీయ విద్యార్థి ఒకరు మృతి చెందారు. మంగళవారం ఉదయం దేశంలో రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌లో జరిగిన బాంబు దాడిలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ భారత విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీ అరిందం బాగ్చి ట్విట్టర్‌లో తెలిపారు. విద్యార్థి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని అన్నారు. మృతుడు కర్ణాటకకు చెందిన మెడిసిన్ విద్యార్థి నవీన్‌గా గుర్తించారు. ఆహారం కోసం బయటకు వెళ్లిన నవీన్ స్థానిక సూపర్‌ మార్కెట్‌ ముందు ఉండగా బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో తీవ్రగాయాల పాలై మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. గత రెండ్రోజులుగా ఖార్కివ్‌ లక్ష్యంగా రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. దీంతో ప్రాణ భయంతో భారతీయ విద్యార్థులు బంకర్లలో తలదాచుకుంటున్నారు. కాగా, ఇప్పటికీ ఖార్కివ్‌లో సుమారు నాలుగు వేల మంది భారతీయ వైద్య విద్యార్థులు చిక్కుకొని ఉన్నారు.