భారతదేశానికి చెందిన ఓ క్షిపణి ప్రమాదవశాత్తు పాకిస్తాన్ దేశంలోకి దూసుకెళ్లింది. అంతేకాకుండా పాకిస్థాన్ భూభాగంలోనే ఆ క్షిపణి కూలింది. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఉన్నత స్థాయి దర్యాప్తునకు శుక్రవారం ఆదేశించింది.
మరోవైపు ఇస్లామాబాద్‌లోని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం భారత దౌత్యాధికారిని గురువారం రాత్రి పిలిపించుకొని తీవ్ర నిరసన తెలిపింది. పారదర్శకమైన దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది. భారత భూభాగం నుంచి తమ గగనతలంలోకి సూపర్ సోనిక్ వేగంతో వస్తువు ఒకటి వేగంగా దూసుకొచ్చి కూలిపోయిందని, దీని వల్ల పౌరుల ఆస్తులకు నష్టం వాటిల్లిందని పాకిస్తాన్ ఆరోపించింది. ‘మార్చి 9వ తేదీ సాయంత్రం 48 గంటలకు భారత్‌లోని సూరత్ గఢ్ నుంచి సూపర్ సోనిక్ వేగంతో వస్తువు ఒకటి పాకిస్థాన్ గగనతలంలోకి దూసుకొచ్చింది. అదే రోజు సాయంత్రం 6.50 గంటల సమయంలో పంజాబ్ ప్రావిన్స్‌లోని ఖానేవాల్ జిల్లా పరిధి మియాన్ చున్ను నగరం సమీపంలో కూలిపోయింది. దీనివల్ల పౌరుల ఆస్తులకు నష్టం కలిగింది. ఈ ఘటనపై పారదర్శకమైన దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశాం. ఇటువంటి వాటి వల్ల ఆకాశ మార్గాల్లో ప్రయాణిస్తున్న విమానాలు ప్రమాదాలకు గురవుతాయి’ అని ఆందోళన వ్యక్తం చేసినట్లు పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ప్రకటన విడుదల చేసినట్లు పేర్కొంది.
మరోపక్క పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ ఈ ఘటనపై సందిస్తూ.. మరో ప్రకటన విడుదల చేశారు. ‘భారత్ తరచూ గగనతల పరిధులు ఉల్లంఘిస్తోంది’ అని ఆరోపించారు.దీంతో ఇటు భారత్‌లో అటు పాకిస్తాన్లో ఉత్కంఠ నెలకొంది.