మాల వేసుకున్నావా? క్లాసుకు రావొద్దు.. భువనగిరి స్కూలు - MicTv.in - Telugu News
mictv telugu

మాల వేసుకున్నావా? క్లాసుకు రావొద్దు.. భువనగిరి స్కూలు

December 3, 2019

Indian mission highschool principal denies entry of ayyappa devotee into classroom

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పించాలని ఉద్యమాలు జరుగుతున్న తరుణం ఇది. ఈ సమయంలో అయ్యప్ప మాలధారణ చేసిన బాలుడిని  హైస్కూల్ యాజమాన్యం 16రోజులుగా తరగతులకు అనుమతించడం లేదు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. పట్టణానికి చెందిన శివారెడ్డి కొడుకు ఇటీవల అయ్యప్ప మాల ధరించాడు. అతడు స్థానిక ఇండియన్ మిషన్ హైస్కూల్లో చదువుకుంటున్నాడు. మాల వేసుకున్నందుకు స్కూలుకు రావొద్దని యాజమాన్యం చెప్పింది. దీంతో 16 రోజులుగా అతడు ఇంట్లోనే ఉంటున్నాడు.

విషయం తెలుసుకున్న నగర అయ్యప్ప స్వాములు స్కూల్ ముందు నిరసన వ్యక్తం చేశారు. దీనిపై యాజమాన్యాన్ని వారు వివరణ కోరగా ఇప్పుడే వస్తానని చెప్పి బయటకు వెళ్లిన ప్రిన్సిపల్.. ఎంతసేపటికీ తిరిగి రాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్వాములు.. ప్రిన్సిపాల్ చాంబర్‌లోకి దూసుకెళ్లి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అయ్యప్ప స్వాములకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. గతంలో ఇదే పాఠశాలలో గణపతి మాల వేసుకున్న విద్యార్థిని కూడా పాఠశాలలోకి అనుమతించలేదని వారు ఆరోపించారు. దీనిపై పాఠశాల యాజమాన్యం క్షమాపణ చెప్పాలని.. విద్యాశాఖ అధికారులు స్పందించి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.