ఆస్ట్రేలియాలో ఉంటున్న భారతీయుడిని అక్కడి పోలీసులు కాల్చి చంపారు. తమిళనాడుకు చెందిన మహమ్మద్ రహమతుల్లా సయ్యద్ అహ్మద్(32) బ్రిడ్జింగ్ వీసాపై గత కొన్నాళ్లుగా సిడ్నీలో ఉంటున్నాడు. సిడ్నీ రైల్వే స్టేషన్‌లో ఓ క్లీనర్‌ను కత్తితో పొడవమే కాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైనా అటాక్ చేయడంతో ఆయనను కాల్చిచంపినట్టు తెలుస్తోంది. పోలీసులు రహమతుల్లాపై మూడు రౌండ్లుకాల్పులు జరపగా తీవ్ర గాయాల పాలయ్యాడు. అందులో రెండు అహ్మద్ చాతీలోకి దూసుకెళ్లాయి. దీంతో వెంటనే అతడికి అక్కడే చికిత్స అందించి స్థానిక ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆయన చనిపోయినట్టు తెలిసింది. ఏసీపీ స్మిత్ మాట్లాడుతూ.. నిందితుడిపై ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదన్నారు. తీవ్రవాద దాడిగా భావించడం లేదని ఆ కోణంలో విచారించడం లేదని చెప్పారు.
ఈ ఘటనపై ఆస్ట్రేలియాలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని విచారం వ్యక్తం చేసింది. విదేశీ వ్యవహారాలు, వాణిజ్య విభాగంతోపాటు పోలీసు అధికారుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తామని తెలిపింది. కాగా, అహ్మద్‌పై కాల్పులు జరపడం తప్ప వేరే మార్గం లేకపోయిందని న్యూ సౌత్‌వేల్స్ పోలీసు అసిస్టెంట్ కమిషనర్ స్టువార్ట్ స్మిత్ పేర్కొన్నారు. కాగా, అహ్మద్ దాడి కత్తితో దాడిచేసిన క్లీనర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.