ఇదీ భారత్ గొప్పతనం.. అఫ్ఘాన్‌కు మానవీయ సాయంపై తాలిబన్లతో చర్చలు - MicTv.in - Telugu News
mictv telugu

ఇదీ భారత్ గొప్పతనం.. అఫ్ఘాన్‌కు మానవీయ సాయంపై తాలిబన్లతో చర్చలు

June 3, 2022

మానవతా సాయంలో భారత్ ఏ దేశానికీ తీసిపోదు. చివరకు కరడుగట్టిన తాలిబన్ మిలిటెంట్ల అధీనంలోని అఫ్ఘానిస్తాన్‌కు సైతం భారతావని మానవతా హస్తాన్ని చాటింది. ఆ దేశంలోని ఆపన్నులకు సాయం చేసే అంశంపై తాలిబన్లతో చర్చించడానికి భారతీయ అధికారులు కాబూల్ వెళ్లారు. సాయం తీరుతెన్నులపై మిలిటెంట్లతో చర్చించారు. అఫ్ఘాన్‌లోని తాలిబన్ ప్రభుత్వాన్ని భారత్ అధికారికంగా గుర్తించకపోయినా సాయం కోసం ఈ చొరవ తీసుకుంది. గత ఏడాది తాలిబన్లు అఫ్ఘాన్‌ను ఆక్రమించుకున్న తర్వాత అక్కడి భారత దౌత్య సిబ్బంది స్వదేశానికి వచ్చేశారు. అమెరికా సైన్యం వెళ్లిపోవడంతో తాలిబన్ల పాలనతో తమకు రక్షణ ఉండదని చాలమంది విదేశీయులు, దౌత్యవేత్తలు కాబూల్‌ను వదిలేశారు. ఈ నేపథ్యంలో భారత అధికారులు కాబూల్ వెళ్లి తాలిబన్ నేతలతో సమావేశం కావడం ఆసక్తి రేపుతోంది. అఫ్ఘాన్ పార్లమెంటు భవనాన్ని భారత ప్రభుత్వమే దాదాపు 800 కోట్ల రూపాయలతో నిర్మించింది. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కూడా సమకూర్చింది.