భారతత సంతతికి చెందిన మన్ ప్రీత్ మోనికా సింగ్ హారిస్ కౌంటీ జడ్జీగా ప్రమాణ స్వీకారం చేశారు. యూఎస్ లో మొదటి మహిళా సిక్కు న్యాయమూర్తిగా పేరు సంపాదించారు.
మోనికా సింగ్.. హ్యూస్టన్ లో పుట్టి పెరిగారు. ఇప్పుడు ఆమె భర్త, ఇద్దరు పిల్లలతో బెల్లయిర్ లో నివసిస్తున్నారు. టెక్సాస్ లోని లా నంబర్ 4లో హారిస్ కౌంటీ సివిల్ కోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. సింగ్ తండ్రి 1970 ప్రారంభంలో యూఎస్ కి వలస వచ్చారు. ఆమె 20 సంవత్సరాలుగా ట్రయల్ లాయర్, స్థానిక, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో అనేక పౌర హక్కుల సంస్థల్లో పాల్గొంది.
ప్రమాణ స్వీకారం..
కిక్కిరిసిన కోర్టు హాలులో ఈ వేడుక జరిగింది. ఈ వేడుకకు రాష్ట్ర తొలి దక్షిణాసియా న్యాయమూర్తి అయిన ఇండియన్ – అమెరికన్ జడ్జి రవి శాండిల్ అధ్యక్షత వహించారు. ఆయన ‘సిక్కు సమాజానికి ఇది నిజంగా గొప్ప క్షణం. మన్ ప్రీత్ సిక్కుల రాయబారి మాత్రమే కాదు, ఆమె ఈ రంగంలో ఉన్న మహిళలందరికీ అంబాసిడర్’ అని చెప్పారు. మన్ ప్రీత్ కూడా.. ‘నేను హ్యూస్టన్ కు ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఇది నాకు చాలా ముఖ్యమైనది. నేను ఈ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాను’ అని ప్రమాణ స్వీకారోత్సవంలో చెప్పారు.
గర్వకారణం..
యూఎస్ లో 5లక్షల మంది సిక్కులు ఉన్నారని అంచనా. హ్యూస్టన్ ప్రాంతంలోనే 20వేల మంది సిక్కులు నివసిస్తున్నారు. వీరందరికీ ఆమె ప్రతినిధిగా నిలవబోతున్నది. ఇక్కడి మేయర్ సిల్వెస్టర్ ఈ సందర్భంగా.. ‘ఇది సిక్కు కమ్యూనిటీకి గర్వకారణమైన రోజు. అయితే కోర్టులో వైవిధ్యమైన కేసులు వస్తుంటాయి. వారందరినీ చూసుకోవాల్సిన బాధ్యత మన్ ప్రీత్ మీద ఉన్నది. వారందరికీ ఈమె వారధి. ఇప్పటి వరకు యూఎస్ లో సిక్కు మహిళా జడ్జ్ లేదు. కాబట్టి ఈమె నిజంగా రికార్డు సృష్టిందనే చెప్పాలి’ అన్నారు.