Indian pregnant woman dies. Portugal Health Minister resigns
mictv telugu

భారతీయ గర్భిణీ మహిళ మృతి.. పోర్చుగల్ ఆరోగ్య మంత్రి రాజీనామా

September 1, 2022

పోర్చుగల్‌లో నివాసముంటున్న ఓ భారతీయ కుటుంబానికి విషాద ఘటన ఎదురయ్యింది. గర్భిణీగా ఉన్న భారతీయ మహిళకు సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో మరణించగా, అందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. అటు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన అక్కడి ప్రభుత్వం సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది. వివరాల్లోకెళితే.. గర్భిణీగా ఉన్న 34 ఏళ్ల భారతీయ మహిళ ప్రసవం కోసం రాజధాని నగరంలోని సాంతా మారియా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఖాళీ లేకపోవడంతో మరో ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో గుండెపోటు వచ్చి మహిళ మరణించింది. వెంటనే అత్యవసర సిజేరియన్ చేసిన వైద్యులు.. చిన్నారిని బయటకు తీశారు. తల్లి మరణం తర్వాత పుట్టిన ఆ చిన్నారి పాప పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ విషయం వైరల్‌గా మారి తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టింది. కరోనా సమయంలో విశేష సేవలందించిన ఆరోగ్య శాఖ మంత్రి మార్టా టెమిడో నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు. ఆమె సేవలను ప్రధాని అంటోనియో కోస్టా మెచ్చుకుంటూనే తాజా ఘటనపై విచారం వ్యక్తం చేశారు. కాగా, పోర్చుగల్‌లో ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ఇందుకు ప్రధాన కారణం గైనకాలజీ నిపుణుల కొరత అని తేలింది. దీంతో ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇతర దేశాల నుంచి వైద్యనిపుణులను నియమించుకుంటున్నట్టు అక్కడి మీడియా తెలిపింది.