Indian President Draupadi Murmu will attend Elizabeth's funeral
mictv telugu

ఎలిజబెత్ అంత్యక్రియలకు ద్రౌపది ముర్ము.. ఆహ్వానం అందని 3 దేశాలు

September 14, 2022

బ్రిటన్ దివంగత మహారాణి ఎలిజబెత్ 2 అంత్యక్రియలకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 19న జరిగే ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల అధినేతలు హాజరుకానుండగా, మొత్తం 500 మంది వీవీఐపీలు హాజరు అవుతారని సమాచారం. మన దేశం నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండ్రోజులు ఆ దేశంలో ఉండి కార్యక్రమానికి హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, న్యూజిలాండ్, కెనడా, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రులు, దక్షిణాఫ్రికా, జర్మనీ అధ్యక్షులు, బెల్జియం, స్వీడన్, నెదర్లాండ్స్, స్పెయిన్ దేశాల రాజులు, రాణులు హాజరవుతున్నారు. వీరందరితో ఆదివారం సాయంత్రం ప్రస్తుత రాజు చార్లెస్ సమావేశమవుతారు. సోమవారం ఉదయం వెస్ట్ మినిస్టర్స్ అబ్బే నుంచి విండ్సర్ క్యాజిల్‌లోని సెయింట్ జార్జ్ చాపెల్ వరకు అంతిమ యాత్ర కొనసాగనుంది. కాగా, ప్రపంచంలోని మూడు దేశాలకు మాత్రం ఈ కార్యక్రమానికి అహ్వానం పంపలేదు. అవి రష్యా, దానికి సపోర్ట్ చేస్తున్న బెలారస్, మరొకటి ఆసియా దేశమైన మయన్మార్. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్నందున రష్యా, అందుకు పూర్తిగా సహకరిస్తున్నందుకు బెలారస్‌ను, సైన్యం తిరుగుబాటు చేసి అధికారం చేపట్టడంతో మయన్మార్‌ను ఆహ్వానించలేదని తెలుస్తోంది. ఈ దేశాలతో దౌత్య సంబంధాలు కొనసాగించేందుకు బ్రిటన్ సుముఖంగా లేదని స్థానిక మీడియా వెల్లడించింది.