కరోనా లాక్డౌన్ నుంచి చాలా రంగాలకు సడలింపులు ఇచ్చిన కేంద్రం ప్రధాన నగరాల మధ్య ప్రత్యేక రైళ్లను తిప్పుతున్న విషయం తెలిసిందే. అయితే టికెట్లు కన్ఫమ్ అయిన వారికి మాత్రమే వీటిలో వెళ్లే అవకాశముంది. డిమాండ్ విపరీతంగా ఉండడంతో ఇకపై వెయిటింగ్ లిస్టు అవకాశం కూడా కల్పించాలని రైల్వే నిర్ణయించింది.
ఈ నెల 22 నుంచి నడిపే ప్రత్యేక రైళ్లలోవెయిటింగ్ లిస్ట్ టికెట్లు అందుబాటులో ఉంటాయని, 15 నుంచి బుకింగ్స్ ప్రారంభం అవుతాయని తెలిపింది. అయితే రద్దీని తగ్గించడానికి వెయిటింగ్ లిస్ట్ టికెట్ల సంఖ్యను భారీగా తగ్గించామని వెల్లడించింది. స్లీపర్ క్లాసులో 200, చెయిర్ కార్, థర్డ్ ఏసీలో 100, సెకండ్ ఏసీలో 50, ఫస్ట్ ఏసీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్ లలో 20 మాత్రమే వెయిటింగ్ లిస్ట్ టికెట్లను అమ్ముతామని వివరించింది. వలస కూలీలను తరలించడానికి రైల్వే శ్రామిక్ రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. క్రమంగా ప్రత్యేక రైళ్లను, ఆ తర్వాత రెగ్యులర్ రైళ్లను నడపడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. లాక్ డౌన్ 4.0లో మొత్తం రైళ్లను నడిపే అవకాశముంది.