రైల్లో యువతిపై కీచకం.. కాపాడిన రైల్వేమంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

రైల్లో యువతిపై కీచకం.. కాపాడిన రైల్వేమంత్రి

March 14, 2019

అధికారంలో వున్న నాయకులు ఎలా వుండాలి?  ప్రజల సమస్యల పట్ల స్పందించాలి. అవసరమైన చర్యలు తీసుకుని వారికి అండగా నిలవాలి. అప్పుడే ఆ నేత ప్రజా హృదయాల్లో నిలిచిపోతాడు. అదే పనిచేశారు దేశ రైల్వేమంత్రి పియూష్ గోయల్.

రైలు ఎక్కిన ఓ ఆడబిడ్డ ఆపదలో చిక్కుకుంది. నలుగురైదుగురు తాగొచ్చి ఆమెను అల్లరి చేయబోయారు. ఈ విషయాన్ని ఆమె తన అన్నకు ఫోన్ మెసేజ్ ద్వారా తెలిపింది. అప్పుడు అన్న దూరంగా వున్నాడు. ఏం చేయాలో తోచక మంత్రి ట్విటర్‌కు ఇదీ పరిస్థితి అని ట్వీట్ చేశాడు. మంత్రి అంటే చాలా బిజీ షెడ్యూల్ వుంటుంది. స్పందిస్తారో లేదో అనే అనుమానంతోనే ట్వీట్ చేశాడు. కానీ పీయూష్ గోయల్ ఆ ట్వీట్ చదివి వెంటనే జీపీఆర్ పోలీసులను పంపించి ఆమెను వారి బారినుంచి రక్షించారు. దీంతో ఆ అన్న ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. బాధ్యతగల నేత అంటే ఇలా వుండాలని కృతజ్ఞతలు తెలిపాడు.

ఈ ఘటన భోపాల్‌లో చోటు చేసుకుంది. విశాఖ నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న 22415నెంబర్ ట్రైన్‌లో యువతి ప్రయాణిస్తోంది. భోపాల్ నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న ఆ యువతి వున్న కోచ్‌లోకి కొందరు ఆకతాయిలు ఎక్కారు. వాళ్లు అప్పటికే బాగా తాగి వున్నారు. యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. దీంతో సదరు యువతి తన అన్నకు తను ఆపదలో చిక్కుకున్నానని మెసేజ్ పెట్టింది.

అప్పుడతను రాంచీలో ఉన్నాడు. అమాంతం వెళ్లి చెల్లిని కాపాడుకోలేడు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుండగా అతనికి ఓ ఐడియా వచ్చింది. వెంటనే తన ట్విటర్ అకౌంట్ ఓపెన్ చేసి రేైల్వే మంత్రి పియూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్లారు. రైల్వే మంత్రి అధికారిక ట్విటర్‌ను అనుసంధానిస్తూ ‘సార్, నా సోదరి ట్రైన్ నంబర్ 22415లో ప్రయాణిస్తోంది. ఆమె బెర్త్ దగ్గరకు కొందరు యువకులు మద్యం మత్తులో వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. నేనిప్పుడు రాంచీలో ఉన్న కారణంగా.. సాయం చేయలేని స్థితిలో ఉన్నాను. మీ సాయం కోసం అభ్యర్థిస్తున్నాం’ అని కోరాడు.

ట్విటర్‌లో ఆ పోస్ట్ చూసి వెంటనే స్పందించారు మంత్రి. ‘ మీరు చేసిన సూచనకు, ఇచ్చిన సమాచారానికి ధన్యవాదాలు. నిశ్చింతంగా ఉండండి.. మీ సోదరిని రక్షించేందుకు ఇప్పటికే జీఆర్‌పీ పోలీసులను రంగంలోకి దింపాం’ అని భరోసా ఇచ్చారు. ఆ వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. జీఆర్‌పీ పోలీసులను ఆమె ప్రయాణిస్తున్న ట్రైన్‌లోకి పంపించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చారు. అనంతరం మంత్రి యువతి క్షేమ సమాచారాన్ని మళ్లీ ట్విటర్ ద్వారా ఆమె సోదరుడికి తెలియజేశారు. ఈ ఘటనపై ఆమె సోదరుడు మంత్రిగారి బాధ్యతను గుర్తుచేస్తూ కృతజ్ఞతలు తెలియజేశాడు. బాధ్యతగల పౌరులు కాదు.. ఇలాంటి బాధ్యత గల నేతలు వున్నప్పుడే దేశం మరింత ముందుకు పోతుంది అని కొందరు యూజర్లు కామెంట్లు చేస్తున్నారు.