Indian Railways offers car ride to student after his train gets cancelled in Gujarat
mictv telugu

రైలు రద్దవడంతో విద్యార్థి కోసం కారు బుక్ చేసిన రైల్వే శాఖ

July 14, 2022

గత కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగా పలు చోట్ల రోడ్డు, రైలు మార్గాలు దెబ్బతినడంతో.. గుజరాత్‌లో రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. రైళ్లు రద్దు చేసిన తర్వాత భారతీయ రైల్వే ఓ విద్యార్థి కోసం కారు అద్దెకు తీసుకుని మరీ అతడు సరైన సమయంలో గమ్యస్థానం చేరేలా సహాయపడింది. దీనికి ఆ విద్యార్థి రైల్వే శాఖకు కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే..

గుజరాత్‌కు చెందిన సత్యం గధ్వి మద్రాస్‌ ఐఐటిలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఇటీవల సొంతూరుకు వచ్చిన సత్యం.. తిరిగి చెన్నైకి బయల్దేరేందుకు.. ఏక్తా నగర్ రైల్వే స్టేషన్ నుంచి వడోదర స్టేషన్‌కు.. వడోదర నుంచి చెన్నైకి రెండు టిక్కెట్లను బుక్ చేసుకున్నాడు. అయితే భారీ వర్షాల కారణంగా ఏక్తా నగర్ నుంచి వడోదరను కలిపే రైల్వే ట్రాక్‌లలో కొన్ని భాగాలు కొట్టుకుపోయాయి. దీంతో ఈ మార్గంలో రైలు సర్వీసులు చివరిక్షణంలో రద్దు చేశారు రైల్వే అధికారులు. ఏక్తా నగర్‌ స్టేషన్‌కు వచ్చాక ఈ విషయం తెలుసుకున్న సత్యం.. తన ప్రయాణ విషయమై స్టేషన్‌ సిబ్బందిని కలిశాడు. దీంతో అక్కడి రైల్వే సిబ్బంది అతడి కోసం ప్రత్యేకంగా కారు బుక్‌ చేసి వడోదర స్టేషన్‌కు పంపించారు.

వడోదరలో రైలెక్కిన తర్వాత రైల్వే సిబ్బందికి కృతజ్ఞతలు చెబుతూ సత్యం ఓ వీడియో పోస్ట్‌ చేశాడు. ప్రతి ప్రయాణికుడికి రైల్వేశాఖ ఎంతో ప్రాముఖ్యం ఇస్తుందని తనకు అర్ధమైందన్నాడు. రైలు రద్దుతో కారు ఏర్పాటు చేసి తనను వడోదరకు తీసుకువచ్చిన రైల్వే అధికారులకు సత్యం కృతజ్ఞతలు తెలియజేశాడు. కారు డ్రైవర్‌ కూడా తనను సమయానికి వడోదర స్టేషన్‌కు చేర్చారన్నాడు. లగేజీ కూడా రైల్వే సిబ్బందే తీసుకొచ్చి రైల్లో పెట్టించారని వారికి ఈ వీడియోను వడోదర డీఆర్‌ఎం ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా.. ప్రస్తుతం వైరల్‌గా మారింది.