Indian Railways: You can now book or cancel your train tickets 5 minutes before departure
mictv telugu

5 నిమిషాల ముందు కూడా రైలు టికెట్‌ బుక్ చేసుకోవచ్చు

August 8, 2022

రైలులో ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ముందుగానే టికెట్స్ బుక్ చేసుకోవడం చాలామంది చేసే పని. వారం ముందుగానే టికెట్స్ బుక్ చేసుకుంటే.. వెళ్లే సమయంలో ఎలాంటి హడావుడి ఉండదని, లేదంటే సీట్ కన్ఫార్మ్ అవుతుందని అందరూ అనుకునేదే. అయితే స్టేషన్ నుంచి రైలు బయల్దేరే సమయానికి 5 నిమిషాల ముందు బుక్ చేసుకున్నా సీట్లు లభిస్తాయని మీకు తెలుసా? నిజమే.. టికెట్స్ ఖాళీ ఉంటే రైలు బయల్దేరడానికి 5 నిమిషాల ముందు కూడా టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు, కౌంటర్‌ వద్ద గానీ, ఆన్‌లైన్‌లోగానీ టికెట్‌ పొందొచ్చు. చాలా రోజుల నుంచీ రైల్వే శాఖ ఈ సదుపాయం ఉన్నప్పటికీ చాలా మంది వినియోగించుకోవడం లేదు. కాబట్టి దీని గురించి తెలుసుకుందాం. అక్టోబర్ 10, 2020 నుంచే ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

అంతకుముందు రైలు ప్రయాణించే సమయం 2 గంటల ముందు ఫైనల్‌ ఛార్ట్‌ని తయారు చేసేవారు. కానీ ఇప్పుడు రైలు బయల్దేరే సమయానికి 4 గంటల ముందు మొదటి రిజర్వేషన్ ఛార్ట్‌ తయారు చేస్తారు. ఆ తరువాత ఎవరైనా సీట్లను క్యాన్సిల్ చేసుకుంటే వాటిని పీఆర్‌ఎస్‌ కౌంటర్ల ద్వారా రెండో చార్ట్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇప్పుడు రైలు బయల్దేరడానికి 5 నిమిషాల ముందు వరకు టికెట్‌ బుక్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. అదే విధంగా బుక్ చేసుకున్న టికెట్‌ను అవసరం లేదంటే క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి రైలు ప్రయాణం చేయాలనుకునేవారు ట్రైన్‌ బయల్దేరడానికి ముందు కూడా టికెట్ల కోసం చూడడం మంచిది. ఇందుకోసం https://www.irctc.co.in/online-charts/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రైలు నంబర్‌, తేదీ, ఎక్కాల్సిన స్టేషన్‌ వివరాలు ఇస్తే.. మీకు అక్కడ ఒక్కో భోగీలో ఎన్ని బెర్తులు ఖాళీ ఉన్నాయో తెలుసుకోచ్చు. ఒకవేళ టికెట్లు ఉంటే.. అక్కడే బుకింగ్‌కు ఆప్షన్‌ ఉంటుంది. దీంతో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు.