ఇండియాలో హిజాబ్ వివాదం ఓ పక్క నడుస్తుండగా, గల్ఫ్ దేశమైన బహ్రెయిన్‌లో దీని వల్ల ఓ రెస్టారెంట్ మూతబడింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అడ్లియాలో ప్రముఖ భారతీయ రెస్టారెంట్ 1987 నుంచి నడుపుతున్నారు. ఇటీవల ఓ మహిళ హిజాబ్ ధరించి రెస్టారెంట్లోకి అడుగుపెట్టింది. గమనించిన సిబ్బంది ఆమెను లోపల వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ విషయం సంచలనంగా మారడంతో అక్కడి టూరిజం అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. దర్యాప్తులో నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలడంతో రెస్టారెంటును అధికారులు మూసివేశారు. ప్రజల పట్ల ఏ వివక్షనైనా సహించేది లేదని ఆ శాఖ హెచ్చరించింది. దీనిపై రెస్టారెంట్ యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది. క్షమాపణ చెప్తున్నామని, ఘటనకు బాధ్యుడైన మేనేజరుని తొలగిస్తున్నామంటూ ప్రకటించింది. 35 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉంటూ అందరికీ సమానంగా సేవలు అందిస్తున్నట్టు తెలిపింది.