అమెరికాలో జాతి వివక్ష మళ్లీ జడలు విప్పింది. వాషింగ్టన్ లో గగన్ దీప్ సింగ్ అనే 22 ఏళ్ల భారతీయ సిక్కు యువకుడిని ఒక అమెరికన్ కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. యూనివర్సిటీలో తనకు సీటు రాలేదన్న అక్కసుతో ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. గగన్ సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతూ టాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గత నెల 28న వాషింగ్టన్ లోని స్పోకేన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద జాకబ్ కోల్మన్ అనే 19 ఏళ్ల అమెరికన్ విద్యార్థి గగన్ ట్యాక్సీ ఎక్కాడు.
ఇడాహోలోని తన మిత్రుడికి ఇంటికి తీసుకెళ్లమని కోరాడు. తర్వాత వెంట తెచ్చుకున్న కత్తితో గగన్ ను విచక్షణా రహితంగా పొడిచాడు. దీంతో గగన్ అక్కడిక్కడే చనిపోయాడు. కోల్మన్ కు గొంజాగా కేథలిక్ వర్సిటీలో సీటు రాకపోవడంతో భారతీయులపై విద్వేషంతో హత్యకు పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. అయితే వర్సిటీ దీన్ని తోసిపుచ్చింది. కోల్మన్ అసలు తమకు దరఖాస్తే చేసుకోలేదని తెలిపింది. కోల్మన్ పై పోలీసులు హత్యాభియోగం కింద కేసు పెట్టారు. హతుడు గగన్ పంజాబ్ లోని జంషెడ్పూర్ వాసి . జలంధర్ కాంగ్రెస్ నాయకుడు మన్మోహన్ సింగ్ రాజుకు మేనల్లుడు.