INDIAN WOMAN SAND ARTIST GOURI
mictv telugu

చెదిరిపోని కళ ఆమె సొంతం

November 18, 2022

INDIAN WOMAN SAND ARTIST GOURI

ఇసుక ఆమె చేతిలో పడితే శిల్పమవుతుంది. అందులో కొత్తేమీ లేకపోవచ్చు. నీటిపై రాత… ఇసుకపై గీత… ఆయుర్దాయం రెప్ప పాటు కాలమే కదా! కానీ… ఆమె సైకత శిల్పం కెరటానికి కొట్టుకుపోదు. మరి..! మ్యూజియంలో ఒదిగి కళాభిమానులను అలరిస్తుంది. అదెలా..? ఎవరామె..? రండి…చూసేద్దాం.

గౌరీ ఎంఎన్‌.. దేశంలోనే సైకత శిల్పాలు చెక్కే ఏకైకా మహిళా కళాకారిణి. సాగర తీరానికి వెళ్లినప్పుడు ఇసుకు మేడలు కట్టిన సందర్భాలు… దానిపై రాసిన రాతలు… అలలు వచ్చి వాటిని చెరిపేసిన జ్ఞాపకాలు మనందరికీ ఎన్నో. గౌరి బాల్యం కూడా అందుకు భిన్నమేమీ కాదు. కర్ణాటక రాష్ట్రం మైసూరులో పుట్టి పెరిగినా… సముద్ర తీరాలకు వెళ్లినప్పుడల్లా ఇసుకు కోటలు కట్టింది. అయితే మనం అక్కడే వదిలేసిన ఆ చిన్నప్పటి సరదాని పెద్దయ్యాక కూడా కొనసాగిస్తూ వచ్చింది. అదే ఆమె జీవితంగా మలుచుకుంది.

INDIAN WOMAN SAND ARTIST GOURI

ఆసక్తి ఎలా కలిగిందో తెలియదు… కానీ ఊహ తెలిసినప్పటి నుంచి బొమ్మలు, శిల్పాలపై అంటే నాకెంతో ఇష్టం. అందులోనే నా కెరీర్‌ అనుకునేదాన్ని. ‘మిషన్‌ టూల్‌ టెక్నాలజీ’లో డిప్లమో చదువుతూనే మట్టితో రకరకాల బొమ్మలు చేసేదాన్ని. రాను రాను ఈ కళపై ఆసక్తి పెరిగింది. ఇంటర్‌నెట్‌లో యూట్యూబ్‌ వీడియోలు చూస్తూ నైపుణ్యం పెంచుకున్నాను. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ కళాకారుల పనితనాన్ని పరిశీలించాను. మెళకువలు తెలుసుకున్నాను. వాటన్నింటినీ కలిపి ఒక భిన్నమైన ఆకృతి ప్రయత్నించేదాన్ని. ఆ క్రమంలోనే ‘శాండ్‌ ఆర్ట్‌’ గురించి తెలిసింది. సముద్రపు ఒడ్డున సరదాగా ఇసుక గూడు కట్టడమే కానీ… అది ఒక కళగా అలరిస్తుందన్న విషయం నాకు అప్పుడు అర్థమైంది అంటుంది గౌరీ.

INDIAN WOMAN SAND ARTIST GOURI

శిల్పకళలో మాస్టర్స్‌ చేసినా సైకత శిల్పాలు చెక్కడంలో గౌరి ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. ఇతర శిల్ప కళలతో పోలిస్తే ఇది ఎంతో భిన్నమైనదే కాదు… కష్టమైనది కూడా. ఇందులోని లోతుపాతులు తెలుసుకోవడానికి ఆమె ఒడిశాలో నిర్వహించిన ‘అంతర్జాతీయ శాండ్‌ ఆర్ట్‌ ఫెస్టివల్‌’కు వెళ్ళింది. అక్కడ కళాకారులు ప్రదర్శించిన రకరకాల శైలులు, నైపుణ్యాలను నిశితంగా పరిశీలించింది. ‘‘ఆ స్ఫూర్తితో నేను కూడా ఇసుకలో ప్రయోగాలు ప్రారంభించాను. ప్రముఖ కళాకారుల చిత్రాలు, వీడియోలు చూస్తూ చిన్న చిన్న కట్టడాలు కట్టాను. చూసినవారందరినీ అవి ఆకట్టుకునేవి. అది నాలో ఆత్మవిశ్వాన్ని పెంచింది. సైకత శిల్పకళ ఎవరో చెబితే నేర్చుకొనే కంటే మనంతట మనమే ప్రయోగాలు చేసుకొంటూ పోతేనే సత్ఫలితాలు వస్తాయనేది అనుభవపూర్వకంగా నేను గ్రహించాను. ఒక్కో రూపం ఒక్కో పాఠం నేర్పుతుంది’’ అంటూ చెప్తోంది గౌరి.

INDIAN WOMAN SAND ARTIST GOURI

సృజనకు పదును పెట్టి… గంటలకొద్దీ పరిశ్రమించి చెక్కిన సైకత శిల్పం ప్రభ మూన్నాళ్ల ముచ్చటేనా! ఇదే గౌరిని ఆలోచింపజేసింది. అందులో నుంచి పుట్టిందే మ్యూజియం. ‘‘నిజానికి మ్యూజియం ఒకటి ప్రారంభించాలని నేనెప్పుడూ అనుకోలేదు. ఒక ఆర్ట్‌ ఫెస్టివల్‌కు వెళ్లినప్పుడు కొందరు నాకు సలహా ఇచ్చారు… ‘ఇసుకు చిత్రాలు కలకాలం ఉండిపోయేలా, వాటిని అందరూ వీక్షించేలా ఏదైనా చేయవచ్చు కదా’ అని.అలా 2012లో మా సొంత పట్టణంలోనే ‘మైసూరు శాండ్‌ స్కల్ప్చర్‌ మ్యూజియం’ ఏర్పాటు చేశాను’’ అంటూ గౌరి ఎంతో సంతోషంగా చెబుతారు.

ఇసుకను తెచ్చి… శిల్పంగా మలిచిన గౌరి కళారూపాలు టాక్‌ ఆఫ్‌ ద టౌన్‌గా మారిపోయాయి. ఆమెకు ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టాయి. మైసూరు, బెంగళూరుల్లో జరిగే ప్రతి ఫ్లవర్‌ షోకూ కర్ణాటక ప్రభుత్వం ఆమెను అతిథిగా ఆహ్వానించింది. ‘‘నా సైకత శిల్పాల్లో అబ్దుల్‌ కలామ్‌ లాంటి స్ఫూర్తి ప్రదాతలు, దశావతార విష్ణుమూర్తి తదితర దేవతామూర్తులే కాకుండా ఆడపిల్లను కాపాడుకొందాం వంటి సామాజిక సందేశమూ ఉంటుంది అని చెబుతోంది.

ఇప్పటి వరకు దేశంలోని యాభైకి పైగా ప్రాంతాల్లో గౌరి శిల్పాలు కొలువుదీరాయి. గత రెండేళ్లుగా దుబాయ్‌లోని ‘కింగ్‌ అబ్దులజీజ్‌ కేమెల్‌ ఫెస్టివల్‌’లో కూడా ప్రదర్శన నిర్వహిస్తోంది ఆమె. ఇక్కడతో తన ప్రయాణం ఆగలేదని….మరెంతో ముందు వెళ్ళాలని అంటోన్న గౌరికి మనం కూడా ఆల్ ద బెస్ట్ చెబుదామా.