సూడాన్‌లో ఘోరం.. మృతుల్లో 18 మంది భారతీయులు! - MicTv.in - Telugu News
mictv telugu

సూడాన్‌లో ఘోరం.. మృతుల్లో 18 మంది భారతీయులు!

December 4, 2019

ఆఫ్రికా దేశం సూడాన్‌లోని ఓ కర్మాగారంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో భారతీయులు మృత్యువాత పడ్డారని తెలుస్తోంది. దేశ రాజధాని ఖార్తూమ్, పారిశ్రామికవాడలోని సీలా సిరామిక్ ఫ్యాక్టరీలో ఎల్పీజీ ట్యాంకర్ పేలడంతో భారీ అగ్ని ప్రమాదం చోటుకుంది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో 23 మంది మృతి చెందగా, 130 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో 18 మంది భారతీయులు ఉన్నారని  ఈ కర్మాగారంలో దాదాపు 50 మంది భారతీయులు పని చేస్తున్నట్టు సమాచారం. ఈ ఘటనపై అక్కడి భారత రాయబార కార్యాలయం స్పందిస్తూ, మృతుల్లో భారతీయులు కూడా ఉన్నారని తెలిపింది. ఈ ప్రమాదం తర్వాత మరో 16 మంది భారతీయులు కనిపించకుండా పోయారని వెల్లడించింది.

Sudan.

కనుమరుగైన వారిలో కొందరు మరణించి ఉంటారని.. శరీరాలు కాలిపోవడంతో మృతులను గుర్తించడం కష్టంగా ఉందని భారత ఎంబసీ చెప్పింది. 24 గంటల హాట్ లైన్ +249-921917471ను ఏర్పాటు చేశామని విదేశాంగ మంత్రి జై శంకర్ ట్విటర్‌లో తెలిపారు.
ప్రమాదం జరిగిన కర్మాగారంలో అగ్ని ప్రమాదాలను నివారించే ఏర్పాట్లు లేకపోవడంతోనే భారీగా ప్రాణ నష్టం వాటిల్లింది. మంటలను మరింత పెంచే వస్తువులను జాగ్రత్తగా నిల్వ చేయకపోడం వల్ల కూడా ప్రమాద తీవ్రత మరింత పెరిగిందని తెలుస్తోంది. ఈ ఘటన నుంచి తప్పించుకున్న 34 మంది భారతీయులు సాలోమి సిరమిక్స్ ఫ్యాక్టరీ నివాస సముదాయాల్లో ఉన్నారు.

కాగా, పేలుడులో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న, కనిపించకుండా పోయిన భారతీయుల వివరాలను భారత ఎంబసీ బుధవారం విడుదల చేసింది. ఈ వివరాల ప్రకారం ఏడుగురు ఆస్పత్రిలో ఉండగా, వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.