దేశంలో గత 13 నెలల కాలంలో బంగారం దిగుమతులు 35.8 బిలియన్ డాలర్లుగా ఉంటే, ఎలక్ట్రానిక్స్ దిగుమతులు 57.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనికి ప్రధాన కారణం భారతీయుల మోజు బంగారం మీద నుంచి ఎలక్ట్రానికి వస్తువుల మీదకు మళ్ళటమే అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. అప్పట్లో బంగారం కొనిపెట్టుకుంటే ఆపదలో అక్కెరకు పనికొచ్చేది అనుకునేవారు. ఆడవాళ్ళు ఒంటినిండా నగలు ధరిస్తే, మగవారు చేతినిండా ఉంగరాలు, మెడలో లావుపాటి బంగారం చైన్ ధరిస్తే వాళ్ళను ధనికులు అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు తారుమారు అయ్యాయి. జేబులో ఎక్కువ రేటు పలికే ఫోన్ వుంటే అది స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు.

ఎవరి దగ్గర ఆపిల్ ఫోన్ వుందో వాళ్ళు ఎదుటివాళ్ళకు రిచ్‌గా, స్మార్ట్‌గా కనిపిస్తున్నారు. వాళ్ళకు వాళ్ళు కూడా రిచ్‌గా ఫీలవుతున్నారు. దీన్నిబట్టి భారతీయులు స్మార్ట్ఫోన్ల మీద మమకారాన్ని అమితంగా పెంచుకున్నట్టు తెలుస్తోంది. ఫోన్‌తో పాటు టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కొనుగోళ్లు కూడా ఊపందుకున్నాయని గుణాంకాలు చెప్తున్నాయి. వీటివల్ల దేశీయ వాణిజ్య లోటు కూడా పెరిగిపోతుందని కొటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కొటక్ ట్వీట్ చేశారు.