భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ పై కొత్త గొడవ - MicTv.in - Telugu News
mictv telugu

భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ పై కొత్త గొడవ

July 3, 2020

COVAXIN

కరోనా మహమ్మారిని కట్టడి చేయడనికి హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ కంపెనీ ‘కోవాక్సిన్‌’ అనే పేరుతో వ్యాక్సిన్‌ ను తయారు చేసిందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెల్సిందే. ఈ వ్యాక్సిన్ ను మానవులపై ప్రయోగించేందుకు భారత డ్రగ్‌ కంట్రోలర్‌ అనుమతి లభించిందని తెలుస్తోంది. ఈ ట్రయల్స్‌లో పాల్గొనే వారు జూలై 7లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, ఆగస్టు 15వ తేదీలోగా దీనిని ఆవిష్కరించాలంటూ భారత వైద్య పరిశోధనా మండలి డైరెక్టర్‌ జనరల్‌ బలరామ్‌ భార్గవ గురువారం లేఖ రాశారు. అయితే, దీని పట్ల వైద్య నిపుణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ వ్యాక్సిన్ విడుదల తేటినో ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మానవులపై ట్రయల్స్‌ జరగకముందే ఎలా వ్యాక్సిన్‌ విడుదలకు తేదీని ఖరారు చేస్తారని ‘ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎథిక్స్‌’ సంపాదకులు అమర్‌ జెసాని ప్రశ్నించారు. మానవులపై వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ విజయం అవుతాయన్న నమ్మకం ఏమిటని ఆయన అన్నారు. అలాగే ఒడిశాలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ సమ్‌ హాస్పిటల్ ట్రయల్స్‌ ఇంచార్జి వెంకట్రావు మాట్లాడుతూ..ఆగస్టు 15వ తేదీ కాదు గదా, డిసెంబర్‌ 15వ తేదీ నాటికి కూడా ఇది సాధ్యమయ్యే పని కాదన్నారు. ప్రధాన మంత్రి జోక్యం చేసుకున్నా రెండు, మూడు నెలల్లో ట్రయల్స్‌ పూర్తి కావని మరో ప్రభుత్వాస్పత్రికి చెందిన ఎథిక్స్‌ కమిటీ పేర్కొంది. భార్గవ లేఖ గురించి తనకు తెలియదని, నిర్దేశించిన కాల వ్యవధిలో వ్యాక్సిన్‌ను ఆవిష్కరించడం అసాధ్యమని, ఎంత సత్వర నిర్ణయాలు తీసుకున్నా ఆవిష్కరణకు కనీసం ఏడాది కాలం పడుతుందని ఐసీఎంఆర్‌ ఎథిక్స్‌ అడ్వైజరీ కమిటీ చైర్‌పర్సన్‌ వసంత ముత్తుస్వామి చెప్పారు.