నడుస్తున్నదంతా ఆన్ లైన్ యుగం. కోవిడ్ పుణ్యమాని అందరూ డిజిటలైజ్ అయిపోయారు. ముఖ్యంగా చదువులు ఎక్కువగా ఆన్ లైన్ అయిపోయాయి. ఎక్కడున్నా చదువుకోవచ్చు అనే ధీమా రావడంతో ప్రభుత్వాలు కూడా అదే దిశగా ప్లాన్ లు చేస్తున్నాయి. తాజాగా భారత్ లో డిజిటల్ యూనివర్శిటీ రాబోతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ యూనివర్శిటీ అందుబాటులోకి వస్తుందని యూజీసీ చెప్పింది. విద్యార్ధులు కోరుకున్న కోర్సులను ఆన్ లైన్ లోనే అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త జాతీయ విద్యా విధానం ప్రకారం ప్రపంచస్థాయి ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆదేశాలతో యూజీసీ దీన్ని మొదలుపెడుతోంది.
దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్శిటీలు, ఉన్నత విద్యా సంస్థలను ఈ డిజిటల్ యూనివర్శిటీలో భాగస్వాములుగా చేస్తోంది యూజీసీ. ఇందులో అన్ని రకాల కోర్సులు అందుబాటులో ఉంటాయి. క్లాసులు నిర్వహించడం, పరీక్షలు, సర్టిఫికెట్లు అన్నీ మామూలు యూనివర్శిటీలో జరిగినట్టే జరుగుతాయని చెప్పింది. అయితే ప్రస్తుతం విద్యాసంస్థల్లో అమలు అవుతున్న దానికంటే కొంత భిన్నంగా ఉంటుందని చెబుతోంది.
ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలతో పాటూ ప్రభుత్వ ఆర్ధిక సహకారంతో నడిచే విద్యాసంస్థలన్నీ ఈ డిజిటల్ వర్శిటీ పరిధిలో తమ కోర్సులను విద్యార్ధులకు అందుబాటులోకి తేనున్నాయి. విద్యార్ధులు అప్పటికే ఒకచోట చదువుతూ ఉన్నా కూడా ఇందులో కూడా మళ్ళీ వేరే కోర్స్ చేసుకోవచ్చును. క్రెడిట్లు కూడా అందుకోవచ్చు. సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీలను ఈ క్రెడిట్ల ఆధారంగా అందుకోవచ్చు.
ఈ డిజిటల్ యూనివర్శిటీలో సీట్లు లేవనే సమస్య ఉండదు. అలాగే ప్రవేశ పరీక్షలు కూడా ఏమీ ఉండవు. విద్యార్ధులకు ఏ కోర్సులో ఆసక్తి ఉందో దాన్ని నేరుగా అభ్యసించవచ్చును. ప్రస్తుతానికి సర్టిఫికెట్, డిప్లోమా, డ్రిగ్రీలతో ఫ్రారంభమయ్యే ఈ వర్శిటీ సేవలు ముందు ముందు పీజీ, డాక్టరేట్లను కూడా అందించే విధంగా అప్ గ్రేడ్ చేస్తామని చెబుతోంది యూజీసీ.