దేశంలోనే తొలి ప్లాస్మా బ్యాంక్.. పనులు షురూ - MicTv.in - Telugu News
mictv telugu

దేశంలోనే తొలి ప్లాస్మా బ్యాంక్.. పనులు షురూ

July 5, 2020

Plasma Bank

కరోనా వైరస్ ఆందోళనలో వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. దానిని నివారించే దిశలో ప్రత్యాన్మాయ మార్గాల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కరోనా చికిత్సలో ప్రాముఖ్యతను సంతరించుకున్న ప్లాస్మా చికిత్సలో భాగంగా ఓ ప్లాస్మా బ్యాంక్ ఏర్పాటు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం భావించింది. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న రోగులు ప్లాస్మాను దానం చేసేందుకు అర్హులు. ఈ క్రమంలో ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ అండ్‌ బైలరీ సైన్సెస్‌లో స్థాపించిన భారతదేశపు మొట్టమొదటి ‘ప్లాస్మా బ్యాంక్’ పనులు ప్రారంభించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ ప్లాస్మా బ్యాంక్‌ను గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. దాతలు ముందుకొచ్చి, ప్లాస్మా దానం చేయాలని ఆయన కోరారు. ఢిల్లీలోని అన్ని దవాఖానలకు ప్లాస్మాను అందజేయడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ విషయమై  ఢిల్లీ ప్లాస్మా బ్యాంక్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ అనిత మాట్లాడుతూ.. ‘ప్లాస్మా అందిస్తారా? లేదా? అని నాకు ఇంతకుముందు చాలామంది ఫోన్లు చేశారు. అప్పుడు ఇక్కడ వసతులు లేవు. కానీ ఇప్పుడు బ్యాంక్‌ పని ప్రారంభించడంతో ఇది సాధ్యపడనుంది. ప్లాస్మా దానం చేయాలనుకునేవారికి కోవిడ్‌-19 వచ్చినట్లు రిపోర్ట్‌ ఉండాలి. అలాగే వారు కోలుకుని 14 రోజులు అయి ఉండాలి’ అని అనిత వెల్లడించారు. ఈ విషయమై దాతకు ముందుగా కౌన్సెలింగ్‌ ఇస్తామని తెలిపారు. వారి సిరలను పరిశీలించి.. బీపీ, శరీర ఉష్ణోగ్రత కూడా పరీక్షిస్తామని అన్నారు. దాత ఫిట్‌గా ఉన్నట్లు తేలితేనే ప్లాస్మాను స్వీకరిస్తామని చెప్పారు. అనంతరం రోగికి విశ్రాంతి ఇచ్చి, తర్వాత ప్లాస్మా స్వీకరణ ప్రక్రియ ప్రారంభిస్తామని వివరించారు. ‘ప్లాస్మా స్వీకరణ ప్రక్రియకు సహజంగా అయితే రెండు గంటల సమయం పడుతుందని, కానీ యంత్ర సహాయంతో అరగంటలో ప్రక్రియ పూర్తవుతుంది. దాత ఫిట్‌గా ఉన్నట్లు తేలితేనే ప్లాస్మాను స్వీకరిస్తాం. ఒక దాత నుంచి 500 మిల్లీ లీటర్ల ప్లాస్మాను సేకరిస్తాం. ఇది ఇద్దరు రోగులకు ఉపయోగపడుతుంది. స్వీకరించిన ప్లాస్మాను ఏడాది వరకు నిల్వ చేయవచ్చు’ అని అనిత పేర్కొన్నారు.