200 కి.మీ.లు కాలినడక.. ఇరాక్‌లో 50 మంది తెలంగాణవాసుల పాట్లు
లాక్‌డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాలకు, దేశాలకు బతుకుదెరువు కోసం వలస వెళ్లినవారు అక్కడ చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఉపాధి నిమిత్తం ఇరాక్‌కు వెళ్లిన 50 మంది అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనుల్లేక, చేతిలో డబ్బులు లేక, తినడానికి తిండి కూడా లభించక అనేక ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బనపల్లికి చెందిన బండారి రాజశేఖర్‌తో పాటు జగిత్యాల, నిజామాబాద్‌కు చెందిన 40 మందికి పైగా తెలంగాణ వాసులు అక్కడ లాక్‌డౌన్ ఇబ్బందులు పడుతున్నారు.
విజిట్ వీసాల మీద కొన్ని నెలల క్రితం వెళ్లిన వీరంతా కుర్దిస్తాన్ రాష్ట్రంలోని ఎర్బీల్ పట్టణంలో ఉన్న వివిధ కంపెనీల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించారు. దీంతో చాలా కంపెనీలు అక్కడ మూతపడ్డాయి. వీరు పనిచేస్తున్న కంపెనీ కూడా మూతపడటంతో వీరికి పనిలేకుండా పోయింది. అత్యంత దయనీయ స్థితిలో వీరు 200 కిలోమీటర్లు నడిచి సేలామాని ప్రాంతానికి చేరుకున్నారు. వారి పరిస్థితిపై కొందరు దయచూపి ఆశ్రయం కల్పించి భోజన సౌకర్యం కల్పించారు. కాగా, ఎలాగైనా తమను తెలంగాణకు తీసుకువెళ్లాల్సిందిగా వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.