వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం - MicTv.in - Telugu News
mictv telugu

వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం

March 12, 2022

cricket

వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. 318 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కరీబియన్ జట్టు 162 పరుగులకే ఆలౌటైంది. దీంతో మిథాలీ టీమ్ ప్రపంచకప్‌లో రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (123; 119 బంతుల్లో 13×4, 2×6),మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హర్మన్ ప్రీత్ కౌర్ (100; 107 బంతుల్లో 10×4,2×6)శతకాలతో రాణించారు. అనంతరం ఛేదనకు దిగిన వెస్టిండీస్ తొలుత దూకుడుగా ఆడినా తర్వాత చేతులెత్తేసింది.

ఓపెనర్లు డియాండ్రా డాటిన్ (62; 46 బంతుల్లో 10×4, 1×6),హేలీ మ్యాథ్యూస్ (48; 36 బంతుల్లో 6×4)ధాటిగా ఆడారు. బౌండరీలే లక్ష్యంగా దంచికొట్టారు. దీంతో విండీస్ 12 ఓవర్లకే 100 పరుగులు సాధించి శుభారంభం చేసింది. ఇక వీరిద్దరూ కీలక భాగస్వామ్యం నెలకొల్పి ప్రమాదకరంగా మారుతున్న సమయంలో భారత బౌలర్లు ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఓపెనర్లతో పాటు మిగతా బ్యాటర్లను వరుసగా పెవిలియన్ పంపారు. దీంతో 100/1తో ఒకానొక దశలో పటిష్టస్థితిలో నిలిచి లక్ష్యం వైపు దూసుకుపోతున్న విండీస్‌ను టీమ్ ఇండియా బౌలర్లు కట్టడి చేశారు.

మరోవైపు టీమ్ ఇండియా సారథి మిథాలీ రాజ్ ఈ మ్యాచ్‌లో కెప్టెన్సీ చేయడం ద్వారా కొత్త రికార్డు నెలకొల్పింది. మహిళల వన్డే ప్రపంచకప్ లో అత్యధిక మ్యాచ్‌కు సారథిగా వ్యవహరించిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ సారథి బెలిండా క్లార్క్ (23)ను మిథాలీ (24) అధిగమించింది. మరోవైపు టీమ్ ఇండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి ఈ మ్యాచ్‌లో ఒక వికెట్ తీయడం ద్వారా వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు (40) తీసిన బౌలర్‌గా కొత్త రికార్డు నెలకొల్పింది.