చైనాతో భారత వాణిజ్య లోటు చరిత్రలో ఎన్నడూ లేనంతగా వంద బిలియన్ డాలర్లకు చేరింది. చైనా వార్షిక కస్టమ్స్ గణాంకాల ప్రకారం ఈ లోటు ఏర్పడగా, 2022లో ఇరు దేశాల మధ్య వాణిజ్యం 135.98 బిలియన్ డాలర్లకు చేరి జీవనకాల గరిష్టాన్ని తాకింది. ఈ నేపథ్యంలోనే లోటు వంద బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం. 2021 లో రెండు దేశాల మధ్య 125 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరగగా, 2022లో అది 8.4 శాతం పెరిగి 135.98 కి చేరింది. ఇందులో చైనా ఎగుమతుల విలువ 2021తో పోలిస్తే 21.7 శాతం పెరిగి 118.50 బిలియన్ డాలర్లుగా నమోదైంది. భారత్ నుంచి ఎగుమతుల విలువ 37.90 శాతం తగ్గి 17.48 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. లోటు విషయానికి వస్తే 2021లో 69.38 బిలియన్ డాలర్లు మాత్రమే ఉండగా, 2022లో రికార్డు స్థాయిలో పెరిగింది. లద్దాఖ్ ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్టు అనిపించినా వాణిజ్యంపై ఆ ప్రభావం పడలేదు. ముఖ్యంగా 2015 – 2021 మధ్య కాలంలో వాణిజ్యం 75.30 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. అంటే ఏటా 12.55 శాతం అన్నమాట. ఇక చైనా విషయానికి వస్తే ఆ దేశ వాణిజ్య మిగులు 877.60 బిలియన్ డాలర్లకు చేరింది. ఆ దేశ మొత్తం ఎగుమతుల విలువ 7 శాతం పెరిగి 3.95 ట్రిలియన్ డాలర్లకు చేరగా, దిగుమతుల విలువ 1.1 శాతం పెంపుతో 2.7 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. అమెరికా, ఐరోపాలలో గిరాకీ తగ్గినా, షాంఘై, బీజింగ్ వంటి నగరాలు కరోనాతో నెలల పాటు స్థంభించినా ఈ పెరుగుదల చోటు చేసుకోవడం ప్రస్తావనార్హం. కాగా, మన దేశంతో ఏర్పడుతున్న వాణిజ్యలోటును పూడ్చడానికి వస్తూత్పత్తి రంగంలో ఉత్పాదకతను భారీగా పెంచాల్సి ఉంది. ఇప్పటికే భారత ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆ వేగం ఏమాత్రం సరిపోదని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.