India’s win against Pakistan in ‘nail-biting’ Asia Cup match
mictv telugu

ఉత్కంఠ పోరులో పాక్‌పై భారత్ ఘన విజయం

August 29, 2022

ఆసియా కప్ ఆరంభ మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది.ఆదివారం చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. 148 పరుగుల టార్గెట్ ను 19.4 ఓవర్లలో ఛేదించింది. ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా చివరి ఓవర్ లో సిక్స్‌ కొట్టి భారత జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. దీంతో గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో పాక్‌చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. 147 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా మొదటి ఓవర్లోనే కేఎల్‌ రాహుల్‌ వికెట్‌ ను కోల్పోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ గోల్డెన్ డకౌట్ కాగా రోహిత్ 12 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. కోహ్లీ మాత్రం తనకు లభించిన లైఫ్‌లను సద్వినియోగం చేసుకుని 35 పరుగులు చేశాడు. కోహ్లీ (35), రవీంద్ర జడేజా (35), హార్దిక్‌ పాండ్యా(33 నాటౌట్‌) భారత జట్టును విజయతీరాలకు చేర్చారు. ముఖ్యంగా హార్దిక్‌ దూకుడైన బ్యాటింగ్‌తో టీమిండియా విజయాన్ని తేలిక చేశాడు. బౌలింగ్‌లోనూ మూడు వికెట్లు తీసిన అతనికే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం లభించింది.

మ్యాచ్‌లో అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ టీమ్ 19.5 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. ఆ టీమ్‌లో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (43: 42 బంతుల్లో 4×4, 1×6) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. బాబర్ అజామ్ (10), ఫకార్ జమాన్ (10), కుష్దీల్ (2), షదాబ్ ఖాన్ (10), ఆసిఫ్ అలీ (9) తేలిపోయారు. అయితే.. మిడిల్ ఓవర్లలో ఇఫ్తికర్ అహ్మద్ (28), ఆఖర్లో దహాని (16) కాస్త బ్యాట్ ఝళిపించడంతో పాక్ 147 పరుగులైనా చేయగలిగింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్య మూడు, అర్షదీప్ సింగ్ రెండు, అవేష్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు.